
- తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లోని 42 ప్రాంతాల్లో సోదాలు
- 38 పాయింట్ ఆఫ్ సేల్స్‌లో ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్‌లను కట్టడి చేయడంలో భాగంగా సీబీఐ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నది. సైబర్ నేరాల్లో కీలకంగా మారిన సిమ్ కార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆపరేషన్ చక్ర –5 సెషన్‌లో భాగంగా వారం రోజులుగా సెర్చ్ ఆపరేషన్లు జరుపుతున్నది. ఈ నెల 10వ తేదీ నుంచి అస్సాం, వెస్ట్ బెంగాల్, బిహార్, యూపీ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లోని 42 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో లింకులు ఉన్న ఫోన్ నంబర్స్ ఆధారంగా టెలికాం ఆపరేటర్స్, పాయింట్ ఆఫ్ సేల్స్ ఏజెంట్లను విచారించింది. 38 పాయింట్ ఆఫ్ సేల్స్‌లో విక్రయిస్తున్న సిమ్ కార్డుల వివరాలను సేకరించింది. వీటి ద్వారా కొనుగోలు చేసిన సిమ్ కార్డులు డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్‌మెంట్, యూపీఐ ఫ్రాడ్స్ సహా వివిధ సైబర్ నేరాల్లో వినియోగించినట్లు గుర్తించింది. 4 రాష్ట్రాలకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించింది. ఈ సోదాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్, కేవైసీ డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డులు సహా కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసింది.