- భారీగా నకిలీ టీ పొడి, సర్ఫ్ ప్యాకెట్లు సీజ్
బషీర్‌బాగ్, వెలుగు: బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ నిత్యావసర సరుకులను అమ్ముతున్న ముగ్గురు వ్యాపారులను హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ టీమ్ అరెస్ట్ చేసింది. గుజరాత్‌కు చెందిన జయ రామ్(30), కచ్చవా సురేందర్ (34), హనుమాన్ రామ్ (21) బేగంబజార్లో హోల్‌సేల్‌గా టైడ్, ఏరియల్, సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ ప్యాకెట్లు, గుడ్ నైట్ లిక్విడ్, రిఫిల్స్, జెమిని, రెడ్ లేబుల్, తాజ్ మహల్ టీ పౌడర్‌ను స్థానికంగా అమ్ముతున్నారు. గుజరాత్ లోని డీలర్స్ నుంచి వీటిని తక్కువగా ధరకు తెప్పిస్తున్నారు.
పక్కా సమాచారంతో పోలీసులు మంగళవారం వీరి గోదాంపై రైడ్ చేసి, 1,340 రెడ్ లేబుల్, 100 తాజ్‌మహల్ నకిలీ ప్యాకెట్లతో పాటు 75 కిలోల లూజ్ టీ పౌడర్, 1,900 వివిధ కంపెనీల సర్ఫ్ ప్యాకెట్లు, 3,600 నకిలీ గుడ్ నైట్ లిక్విడ్ బాటిళ్లతో పాటు 9,500 నకిలీ లేబుల్ కవర్లను సీజ్ చేశారు. అనంతరం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి గోషామహల్, అప్జల్ గంజ్ పోలీసులకు అప్పగించారు.
