హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్టు పనుల తీరును గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (జీఆర్ఎంబీ) చైర్మన్ బీపీ పాండే గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల మేరకు ప్రాజెక్టు పనులు నిలిపివేసినట్లు నిర్ధారించుకోవడంతో పాటు అక్కడ అమలులో ఉన్న భద్రతా చర్యలను ఆయన సమీక్షించారు. ప్రాజెక్టు పరిధిలో పనులు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు ఎన్జీటీ ఆదేశాల మేరకు గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల లైవ్ విజువల్స్ జీఆర్ఎంబీ కార్యాలయానికి ప్రసారం కావాల్సి ఉంది.
ఇటీవల సాంకేతిక కారణాలతో విజువల్స్ నిలిచిపోవడంతో అక్కడ గుట్టుచప్పుడు కాకుండా పనులు సాగుతున్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో బోర్డు అధికారులు ఆకస్మికంగా ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. చైర్మన్ బీపీ పాండే నేతృత్వంలోని బృందం ప్రాజెక్టు ప్రాంతంతో పాటు పంప్‌హౌస్‌ను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో ప్రాజెక్టు వద్ద ఎలాంటి పనులు జరగడం లేదని స్పష్టమైంది. పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు దొంగతనానికి గురైనట్లు అధికారులు గుర్తించారు.
దీని వల్లే లైవ్ విజువల్స్ నిలిచిపోయినట్లు తేల్చారు. ఈ సందర్భంగా చైర్మన్ బీపీ పాండే మాట్లాడుతూ తక్షణమే కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. ఈసారి కెమెరాలను ఎవరూ దొంగిలించలేని విధంగా 20 మీటర్ల ఎత్తులో అమర్చాలని సూచించారు. అలాగే సీసీ కెమెరాల చోరీపై స్థానిక పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ రంగరాజన్, ఈఈ ఎం వేణుగోపాల్, ఇరిగేషన్ ఈఈ రాములు నాయక్, డీఈలు ప్రశాంత్, చైతన్య, నందా, రేష్మ, రాజేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
