ఆరు రాష్ట్రాల సీఎస్, డీజీపీలకు సీఈసీ ఆదేశం

ఆరు రాష్ట్రాల సీఎస్, డీజీపీలకు సీఈసీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అఫ్ ఇండియా (సీఈసీ) ఆదేశించింది. ఈ మేరకు కర్నాటకతో సహా ఆరు దక్షిణాది రాష్ట్రాల సీఎస్​లు, డీజీపీలతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్​కు సంబంధించి చేసిన ఏర్పాట్లను సమీక్షించారు.

సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తు న్న నగదు, మద్యం, డ్రగ్స్ తదితరాలను అరికట్టేందుకు చెక్‌‌పోస్టులు, పెట్రోలింగ్‌‌ను పెంచాలని అధికారు లను సీఈసీ అదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌‌లు, మొ బైల్ స్క్వాడ్‌‌లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పోలింగ్‌‌కు ముందు చివరి 72 గంటలు సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో  కర్నాటకలోకి వచ్చే చాన్స్ ఉన్నందున నిఘా ఉంచాలన్నారు. మన రాష్ట్ర సరిహద్దుల్లో నగదు, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర వస్తువుల తరలింపును నిరోధించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి సీఎస్​ శాంతికుమారి ఎన్నికల సంఘం సభ్యులకు వివరించారు. కర్నాటక ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నదని తెలిపారు. ఆ రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తామని సీఎస్​హామీ ఇచ్చారు.

కర్నాటక సరిహద్దు జిల్లాల నుంచి తెలంగాణలోకి వ్యక్తుల రాకపోకలు, సామగ్రి తరలింపును పర్యవేక్షించడానికి పోలీస్, ఎక్సైజ్ శాఖల చెక్ పోస్ట్‌‌ లు పెంచుతున్నామని వివరించారు. సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, సీఈవో వికాస్ రాజ్, సెక్రటరీ జీఏడీ శేషాద్రి, హోంశాఖ కార్యదర్శి జితేందర్, అదనపు డీజీ స్వాతి లక్రా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.