సెల్​ఫోన్లు ఈజీగా ట్రేస్ చేస్తున్నరు..  1,016 ఫోన్లు బాధితులకు అప్పగింత

సెల్​ఫోన్లు ఈజీగా ట్రేస్ చేస్తున్నరు..   1,016 ఫోన్లు బాధితులకు అప్పగింత
  • సెల్​ఫోన్లు ఈజీగా ట్రేస్ చేస్తున్నరు
  • సీఈఐఆర్‌‌‌‌ పోర్టల్‌‌ సక్సెస్
  • నెల రోజుల్లో 16,011 ఫోన్లు బ్లాక్‌‌, 4,225 ట్రేస్‌‌ 
  •  1,016 ఫోన్లు బాధితులకు అప్పగింత

హైదరాబాద్‌‌, వెలుగు: సెల్​ఫోన్ల ట్రేసింగ్‌‌ కోసం ఏర్పాటు చేసిన సెంట్రల్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌ ఐడెంటిటీ రిజిస్టర్‌‌‌‌(సీఈఐఆర్‌‌‌‌) పోర్టల్‌‌ మంచి రిజల్ట్స్‌‌ ఇస్తున్నది. చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్​​ఫోన్లను ఈ పోర్టల్‌‌ ద్వారా పోలీసులు ఈజీగా సెర్చ్‌‌ చేస్తున్నారు. కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్‌‌(డీఓటీ) ఏర్పాటు చేసిన ఈ పోర్టల్‌‌ను రాష్ట్ర పోలీసులు పైలట్ ప్రాజెక్ట్‌‌గా సెలెక్ట్‌‌ చేశారు. ఈ క్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులను గత నెల19 నుంచి స్వీకరిస్తున్నారు. ఈ విధానంతో ఫోన్లను ట్రేస్‌‌ చేసిన తరువాత అన్‌‌ బ్లాక్‌‌ చేసి బాధితులకు అప్పగిస్తున్నారు.  ఏప్రిల్‌‌ 20 వ తేదీ నుంచి సోమవారం వరకు 1,016 ఫోన్లను ఓనర్లకు అందించారు.

రాష్ట్ర వ్యాప్తంగా నోడల్ ఆఫీసర్స్‌‌

సీఈఐఆర్‌‌ పోర్టల్‌‌పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గత నెల 13న డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రైనింగ్ సెషన్​ నిర్వహించారు. సీఐడీ చీఫ్‌‌ మహేశ్​ భగవత్‌‌తో కలిసి 60 మంది పోలీసులకు మాస్టర్ ట్రైనింగ్‌‌  ఇచ్చారు. ఈ నెల17న అధికారికంగా లాంచ్ చేశారు. దీనికి సూపర్ యూజర్‌‌‌‌గా సీఐడీ చీఫ్‌‌ మహేశ్‌‌ భగవత్‌‌ వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 యూనిట్లలోని 780 పోలీస్‌‌ స్టేషన్లలో సీఈఐఆర్‌‌‌‌ పోర్టల్ యూజర్‌‌‌‌ ఐడీలను అందించారు. జిల్లాల వారీగా ప్రత్యేక నోడల్ ఆఫీసర్స్‌‌ను నియమించారు. సీఐడీ ఆఫీస్‌‌లోని మెయిన్ సర్వర్‌‌తో ఆపరేట్‌‌ చేస్తున్నారు.

నెలరోజుల వ్యవధిలోనే 16,011 కంప్లయింట్లు

నెలరోజుల వ్యవధిలో సీఈఐఆర్‌‌‌‌ పోర్టల్‌‌ ద్వారా వచ్చిన అప్లికేషన్లు పరిశీలించారు. ఐఎంఈఐల ఆధారంగా16,011 మొబైల్‌‌ ఫోన్స్ బ్లాక్‌‌చేసి వీటిలో 4,225 ఫోన్లను ట్రేస్ చేశారు. 1,016 ఫోన్లను ఆయా ఫోన్ల ఓనర్స్‌‌కి అప్పగించారు. కాగా,  సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు149, వరంగల్‌‌లో 91, కామారెడ్డి జిల్లా పోలీసులు 79 ఫోన్లను ట్రేస్​ చేశారు. మొబైల్ ట్రేసింగ్‌‌లో నైపుణ్యం చూపిన అధికారులను డీజీపీ అంజనీకుమార్, సీఈడీ చీఫ్‌‌ మహేశ్‌‌ భగవత్‌‌ అభినందించారు. ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్‌‌, మీ సేవా సెంటర్లు, https://www.ceir.gov.in సైట్‌‌లో అప్లై చేసుకోవాలని డీజీపీ సూచించారు.