సెల్ ఫోన్ చోరీ చేస్తూ.. వ్యక్తి మృతికి కారణమైన నిందితుడి అరెస్ట్

సెల్ ఫోన్ చోరీ చేస్తూ..  వ్యక్తి మృతికి కారణమైన నిందితుడి అరెస్ట్

సికింద్రాబాద్, వెలుగు: సెల్ ఫోన్ చోరీ చేస్తూ వ్యక్తి మృతికి కారణమైన నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నాటక బీజాపూర్​ జిల్లాకు చెందిన లింగప్ప (28) గతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడు. ఏడాది కిందట సిటీకి వచ్చి సికింద్రాబాద్​ రేతిఫైల్ ​బస్టాప్​ ఫుట్​పాత్​పై ఉంటూ కూలీ పనులు చేస్తున్నాడు. అప్పటికే నేర చరిత్ర కలిగిన లింగప్పకు ఆ డబ్బులు చాలకపోవడంతో సెల్​ఫోన్ ​చోరీలు మొదలుపెట్టాడు. అయితే, హన్మకొండకు చెందిన దినేశ్ ఈ నెల 1న తన సొంతూరికి వెళ్లడానికి సికింద్రాబాద్​లో శాతవాహన ఎక్స్​ప్రెస్​ ఎక్కాడు. 

రైలులో రద్దీ ఉండడంతో డోరు వద్ద కూర్చున్నాడు. రైలు లాలాగూడ నుంచి నెమ్మదిగా కదులుతున్న సమయంలో  ట్రాక్ ​పక్కనే నిలబడి ఉన్న లింగప్ప.. దినేశ్ ​చేతిలో ఉన్న సెల్​ఫోన్​ను బలవంతంగా లాక్కుని ఉడాయించాడు. ఈ క్రమంలో దినేశ్​ రైలు చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ నెల 5న మృతి చెందాడు. 

ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం లాలాగూడ రైల్వేస్టేషన్​ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న లింగప్పను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించాడు. దీంతో లింగప్పను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు రైల్వే అర్బన్ డీఎస్సీ జావేద్​ తెలిపారు.