- 54 మంది సిబ్బందికి జనగణన విధులు
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో వైద్య సేవలకు జనగణన (సెన్సెస్) రూపంలో ఆటంకం ఏర్పడనుంది. ఆసుపత్రిలోని కీలక విభాగాలకు చెందిన 60 మంది సిబ్బందిలో 54 మందిని నెల రోజుల పాటు (మే 10 నుంచి జూన్ 10 వరకు) ప్రభుత్వం జనగణన విధుల కోసం కేటాయించింది. సుమారు 90 శాతం సిబ్బంది ఆసుపత్రి విధులకు దూరం కావడంతో అత్యవసర వైద్య సేవలు స్తంభించిపోయే ప్రమాదం ఉందని వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉస్మానియా, నిలోఫర్ వంటి ఆసుపత్రులకు మినహాయింపు ఇచ్చి, గాంధీ ఆసుపత్రి సిబ్బందిని కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులను సంప్రదించగా, కేవలం 10 మంది కీలక ఉద్యోగులకు మాత్రమే మినహాయింపు లభించిందని సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు.
