రూరల్ ఇండ్లపై తేల్చని కేంద్రం .. పీఎం ఆవాస్ ఇండ్ల మంజూరు కోసం ఎదురుచూపులు

రూరల్ ఇండ్లపై తేల్చని కేంద్రం .. పీఎం ఆవాస్  ఇండ్ల మంజూరు కోసం ఎదురుచూపులు
  • ఇప్పటికే బిల్లులు చెల్లిస్తున్న రాష్ర్ట ప్రభుత్వం
  • ప్రతిపాదనలు పంపినా,విజ్ఞప్తులు చేసినా నో రెస్పాన్స్
  • ఈ ఏడాది 1.13 లక్షల ఇండ్లే సాంక్షన్ 

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికంగా చేయూత అందుతుందని ఆశిస్తున్న  రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ప్రధాన మంత్రి ఆవాస్‌‌‌‌‌‌‌‌  యోజన (పీఎంఏవై) కింద పట్టణ ప్రాంత యూనిట్లను ఈ సంవత్సరానికి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ఇండ్లు సాధించుకోవాలని భావించినా, తెలంగాణకు 1.13 లక్షల ఇండ్లు మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. అర్బన్  ప్రాంతాల్లో ఒక్క ఇంటికి పీఎం ఆవాస్  స్కీమ్  నుంచి రూ.1.50 లక్షలను కేంద్రం ఇవ్వనుండగా, రూరల్ లో ఒక్కో ఇంటికి రూ.72 వేలు ఇవ్వనుంది. 

రూ.5 లక్షల ఇంటి బడ్జెట్ లో మిగతా నిధులు రాష్ర్ట ప్రభుత్వం భరించనుంది. ఈ రూపంలో రూ.1,695 కోట్లు మాత్రమే అందే అవకాశం ఉంది. అర్బన్  ఏరియాల్లో ప్రభుత్వ స్థలాలను కలెక్టర్లు గుర్తిస్తున్నారు. ఇక రూరల్ లో మాత్రం ఇండ్లను ఇంత వరకు సాంక్షన్ చేయలేదు. ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం, రాష్ర్ట పర్యటనకు వచ్చినప్పుడు కేంద్ర అర్బన్, హౌసింగ్  మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్​ను సీఎం, హౌసింగ్ మంత్రి కలిసి విజ్ఞప్తి చేయడం, పలుమార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు హౌసింగ్ అధికారులు కోరుతున్నా ఇంత వరకు రూరల్ లో కేంద్రం ఇండ్లను సాంక్షన్  చేయలేదు. 

రూరల్​లో వేగంగా ఇండ్ల నిర్మాణం, బిల్లుల చెల్లింపు

రాష్ర్టవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్  వేగంగా సాగుతోంది. మొదటి, రెండో దశలో కలిపి ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేయగా ఇప్పటి వరకు లక్షన్నర ఇండ్ల పనులు స్టార్ట్  అయ్యాయి. 25 వేల ఇండ్లకు బేస్ మెంట్  పూర్తయ్యాయి. 1500 ఇండ్లకు స్లాబ్స్ పూర్తి కాగా ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.180 కోట్ల దాకా లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లించింది. వీటిలో మొత్తం రాష్ర్ట ప్రభుత్వం నిధులే ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంత యూనిట్ల విషయంలో కేంద్రం నిర్ణయం వెల్లడించలేదు. ఎన్ని ఇండ్లు మంజూరు చేస్తుందో తెలియక రాష్ట్ర ప్రభుత్వంలో కొంత అయోమయం నెలకొంది.  

తొలి ఏడాదికి రూ.22 వేల కోట్లు అవసరం 

నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొదటి సంవత్సరం నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మించనున్నారు. ఈ ఇళ్ల యూనిట్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం రూ.5 లక్షలుగా నిర్ధారించటంతో ఈ ఏడాదికి రూ.22 వేల కోట్లు అవసరం కానున్నాయి. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు పీఎంఏవై పథకం కింద వీలైనన్ని అర్బన్‌‌‌‌‌‌‌‌  యూనిట్లు మంజూరు చేయించుకోవాలని ప్రభుత్వం భావించింది. కేంద్రం అర్బన్‌‌‌‌‌‌‌‌  ఇళ్ల యూనిట్‌‌‌‌‌‌‌‌  కాస్ట్‌‌‌‌‌‌‌‌ను రూ.లక్షన్నరగా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ మేరకు రాష్ట్రంలోని మూడొంతుల ప్రాంతాన్ని పట్టణ ప్రాంతంగా ప్రభుత్వం నిర్ధారించింది. ఇందుకు అర్బన్‌‌‌‌‌‌‌‌  డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌  అథారిటీల సంఖ్యను పెంచడం ద్వారా రాష్ట్రంలోని సింహభాగం ప్రాంతాన్ని వాటి పరిధిలోకి తెస్తూ ఉత్తర్వు జారీ చేసింది. తెలంగాణలో పట్టణీకరణ అధికంగా ఉందని పీఎంఈవై పట్టణ ప్రాంత యూనిట్లను గరిష్ట సంఖ్యలో మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 

స్కీమ్ కు అధికారులు, ఇంజినీర్ల కొరత

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు అధికారులు, ఇంజినీర్లు,  సిబ్బంది కొరత ఏర్పడింది. మండలానికి ఒక ఏఈ, రెండు నియోజకవర్గాలకు ఒక డీఈ, జిల్లాకు ఎస్ఈ స్థాయి అధికారి పీడీగా ఉండాలి. అయితే హౌసింగ్  కార్పొరేషన్​లో ఇంజినీర్లు, సిబ్బంది, నాన్ టెక్నికల్  స్టాఫ్  చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది చివరి వరకు కార్పొరేషన్​లో చాలా మంది అధికారులు రిటైర్  కాబోతున్నారు. దీంతో ఇంజినీర్లు కావాలని పలు శాఖలకు హౌసింగ్ సెక్రటరీ ఇటీవల లేఖలు రాశారు. మున్సిపల్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ లాంటి కీలక శాఖలు కాకుండా మిగతా శాఖలు, కార్పొరేషన్లలో ఉన్న ఇంజినీర్లను కేటాయించాలని లేఖల్లో పేర్కొన్నారు. ఆయా శాఖల్లో ఇంజినీర్లకు అంత పని లేదని అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు అన్ని నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

శ్రావణ మాసం నుంచి ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్

ఆషాడ మాసంలో మంచి రోజులు లేకపోవడంతో ఆగిన ఇందిరమ్మ ఇండ్ల పనులు.. శ్రావణం నుంచి స్పీడప్  కానున్నాయి. గత  20 రోజులుగా  నుంచి కొత్తగా ముగ్గులు పోసేందుకు లబ్ధిదారులు వెనుకడుగు వేశారని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం స్టార్ట్  కానుండడంతో ముగ్గులు పోసి లబ్ధిదారులు ఇండ్ల పనులు తిరిగి ప్రారంభించనున్నారు. సెప్టెంబరు నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు శరవేగంగా ఇండ్ల నిర్మాణాలు జరుగుతాయని అధికారులు అంటున్నారు.