మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ నోటీసులు..వివరణ ఇవ్వకపోతే చర్యలు

మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ నోటీసులు..వివరణ ఇవ్వకపోతే చర్యలు

మంత్రి జగదీశ్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయింది. ఈ నెల 25న మునుగోడు క్యాంపెయిన్ లో మాట్లాడిన జగదీశ్.. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని అన్నారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ లీడర్ కపిలవాయి దిలీప్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కూడా జగదీశ్  రెడ్డి ప్రసంగం నోట్ ను సీఈసీకి పంపారు.

వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న ఈసీ .. ప్రాథమికంగా మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. దీనిపై రేపు సాయంత్రం 3 గంటల్లోగా వివరణ ఇవ్వాలని.. లేకపోతే తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జగదీశ్ రెడ్డిని ఈసీ హెచ్చరించింది. 

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ కు మద్దతుగా ఈ నెల 25న ప్రచారంలో పాల్గొన్న జగదీశ్.. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని  గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు.  రైతు బీమా కావాలంటే టీఆర్ఎస్ కు ఓటేయాలని అన్నారు. ఓటు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందో తేల్చుకోవాలన్నారు. ఒకవేళ  రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే టీఆర్ఎస్ ద్వారా వచ్చే పథకాలన్నీ ఆగిపోతాయని జగదీశ్ రెడ్డి  అన్నారు.