తెలంగాణకు కేంద్ర బలగాలు: సీపీ అంజనీకుమార్‌

తెలంగాణకు కేంద్ర బలగాలు: సీపీ అంజనీకుమార్‌

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 11న ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు అభ్యర్ధులు, సాధారణ పౌరులకు సూచనలు జారీ చేశారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌. తెలంగాణ ఎన్నికలు తొలివిడతలోనే ఉన్నాయని, దీనికోసం హైదరాబాద్‌ పోలీసులు గత 20 రోజులుగా సంబంధించిన మ్యాపింగ్‌ చేశామని, మరో వారం రోజుల్లో పూర్తి చేసి రిటర్నింగ్‌ అధికారుల ద్వారా ఎన్నికల ప్రధానాధికారికి అందజేస్తామన్నారు. బందోబస్తు కోసం 6 నుంచి 10 కంపెనీల సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌ వచ్చే అవకాశముందన్నారు. అనుమానితులు, రౌడీల బౌండోవర్‌ ప్రక్రియ కూడా కొనసాగుతుందన్నారు. మతపరమైన ఘర్షణలకు దారితీసే అంశాలను, వ్యక్తులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కీలక, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు, పెట్రోలింగ్‌ నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయుధ లైసెన్సులున్న వారు తమ ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయుధాలను సంబంధిత పోలీసు స్టేషన్లలో డిపాజిట్‌ చేయాలని సూచించారు సీపీ అంజనీకుమార్‌.