
స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం వాటా నుంచి ఇవ్వాల్సిన రూ.83కోట్లలో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. వరంగల్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు రూ.2,740కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు. అందులో మొదటి విడతగా రూ.576 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు పూర్తికార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు కిషన్ రెడ్డి. నగరం అభివృద్ధి చెందాలని ప్రధాని మోడీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. తాగునీటి సరఫరాను మరింత అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. భద్రకాళీ సరస్సు పునరుద్ధరణకు రూ.31కోట్లు, జైన మందిరం నిర్మాణానికి రూ.1.03కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వేయిస్తంభాల గుడి అభివృద్ధితో పాటు నగరంలో 13 కూడళ్లు, ఎంజీఎం ఆస్పత్రి దగ్గర డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. కాజీపేట దర్గా అభివృద్ధికి రూ.కోటి ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరంగల్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కిషన్‌రెడ్డి కోరారు. తాను కూడా స్థానిక అధికారులతో చర్చిస్తానన్నారు. నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని చెప్పారు. మోడీ ప్రభుత్వం… తెలంగాణ, వరంగల్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణ అవినీతి రహిత రాష్ట్రం కావాలని.. అమరుల ఆకాంక్షల మేరకు ముందుకెళ్లాలని సూచించారు కిషన్‌రెడ్డి.