హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్యాముల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021కు అనుగుణంగా కాంప్రిహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవాల్యుయేషన్ (సీడీఎస్ఈ) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ఈ నెల 17నే సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాశారు.
రాష్ట్రంలో 173 స్పెసిఫైడ్ డ్యామ్స్ ఉన్నాయని, వాటన్నింటికీ భద్రతకు సంబంధించిన స్టడీలు చేయాలని స్పష్టం చేశారు. అందుకు ఓ స్వతంత్ర ఎక్స్పర్ట్స్ప్యానెల్ను నియమించాలని ఆదేశించారు. ‘‘ప్రతి డ్యామ్‌కు సంబంధిత ఓనర్.. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా ఆనకట్టల భద్రతపై స్టడీ చేయాలి. నిబంధనలకు అనుగుణంగా ఎక్స్పర్ట్స్ ప్యానెల్‌ను నియమించాలి.
ఆ ఎక్స్పర్ట్స్ ప్యానెల్‌తోనే అధ్యయనాలు చేయించాలి. డ్యాముల పటిష్టత, ఆపరేషనల్ పరిస్థితులను విశ్లేషించాలి. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అమల్లోకి వచ్చిన ఐదేండ్లలోపు అన్ని స్పెసిఫైడ్ డ్యాముల భద్రతపై విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి అన్ని డ్యాముల భద్రతపై అధ్యయనం చేసి లోపాలు ఏవైనా ఉంటే తెలియజేయండి’’ అని లేఖలో పేర్కొన్నారు.
వచ్చే ఏడాది నాటికి ఇవ్వాలి..
డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ఐదేండ్లలోపు అన్ని డ్యాముల నివేదికలు రావాల్సి ఉన్నందున.. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా రాష్ట్రంలోని అన్ని డ్యాములకు సీడీఎస్ఈ నిర్వహించాల్సి ఉంటుందని లేఖలో సీఆర్ పాటిల్ పేర్కొనారు. చట్టం పేర్కొన్న డెడ్‌లైన్ ప్రకారం పనులను చేయాలన్నారు.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, కాబట్టి రాష్ట్రంలోని అన్ని స్పెసిఫైడ్ డ్యామ్స్‌కు సీడీఎస్‌ఈని 15 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా సాంకేతిక, ఆర్థిక వనరులను డ్యామ్ ఓనర్లు సమకూర్చుకోవాలని సూచించారు. సీడీఎస్‌ఈపై ఏవైనా అనుమానాలుంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)ని సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
