- సరిపడ కోటా ఇవ్వట్లేదంటున్న అధికారులు
- ఇచ్చినవి కొన్ని షాపులకే సరఫరా
- ‘అంత్యోదయ’ చక్కెర కూడా లేనట్టేనా?
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఎండాకాలం నేపథ్యంలో ఏప్రిల్నెలలో నగరంలోని రేషన్‌లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నారు. అయితే, గోధుమలు ఎన్ని నెలలవి ఇస్తారు..? అంత్యోదయ చక్కెర సరఫరా చేస్తారా..? లేదా అన్నవి మాత్రం చెప్పడం లేదు. బియ్యం, గోధుమలు కేంద్రం నుంచి వస్తాయని, వారి గోడౌన్లలో నిల్వలు పేరుకుపోవడంతో డిమాండ్ఉన్నంత వరకు ఇస్తున్నారని, గోధుమలు మాత్రం కోటా ప్రకారం ఇవ్వడం లేదంటున్నారు.
ఉత్తర భారతదేశంలో ఎక్కువగా గోధుమలు తింటారని, అందుకే వారికి ఎక్కువ సరఫరా చేస్తున్నామని, దక్షిణ భారతదేశంలో బియ్యం తింటారు కాబట్టి అవసరం లేదంటూ కొంత వరకే పంపిస్తున్నారని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ గోధుమలు ఎటూ చాలడం లేదు. మరోవైపు ఈ కోటా కూడా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతుండడంతో లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంత్యోదయ కార్డుదారులకు ఇచ్చే చక్కెర గురించీ ఏమీ చెప్పడం లేదు.
45 లక్షల టన్నుల బియ్యం..
సిటీలోని 9 సర్కిళ్ల పరిధిలో 13.50 లక్షల రేషన్‌కార్డులున్నాయి. వీరందరికీ ఏప్రిల్ఒకటో తేదీ నుంచి 3 నెలలకు సరిపడా బియ్యం ఇవ్వనున్నారు. వీటికి సంబంధించిన 45 లక్షల మెట్రిక్‌టన్నులను ఇప్పటికే కేంద్రం కేటాయించింది. కానీ, ఒక్కో కార్డుకు ప్రతి నెలా ఇచ్చే 5 కిలోల గోధుమలు మాత్రం కావాల్సినంత సరఫరా చేయడం లేదు. నగరానికి నెలకు10 లక్షల మెట్రిక్‌టన్నుల గోధుమలు అవసరం కాగా, కేంద్ర సర్కారు 3.5 లక్షల మెట్రిక్ టన్నులే కేటాయిస్తోంది.
వీటిని అధికారులు అన్ని షాపులకు సమానంగా సరఫరా చేయాల్సి ఉండగా ఆ పని చేయడం లేదు. ఇలా కాకుండా అడిగిన వారికి కోటా ప్రకారం కేటాయించాల్సి ఉండగా అలా కూడా చేయడం లేదు. కేవలం కొన్ని సర్కిళ్ల పరిధిలోని తెలిసిన వారి షాపులకు, పరిచయం ఉన్న రేషన్‌డీలర్లకు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
దీంతో తమ సమీప షాపుల్లో గోధుమలు దొరకని వారు పోర్టబులిటీ అందుబాటులో ఉండడంతో ఎక్కడెక్కడ ఇస్తున్నారో తెలుసుకుని కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా వెళ్తున్నారు. కొన్నిసార్లు అక్కడికి వెళ్లేసరికే అయిపోయాయని సమాధానం చెప్తుండడంతో నిట్టూర్చుకుంటూ వెనుదిరుగుతున్నారు. వచ్చే నెలలో మూడు నెలల కోటాలో భాగంగా కార్డుకు 15 కిలోలు ఇవ్వాల్సి ఉండగా, ఐదు కిలోలు ఇస్తారా? లేక 15 కిలోలు ఇస్తారా అన్నదానిపై స్పష్టత ఇవ్వడం లేదు. స్టాక్ వస్తే ఇస్తామని అధికారులు చెప్తున్నారు.
‘షుగర్’తో వ్యాధితో ఛపాతీకే ప్రిఫరెన్స్..
ఇప్పుడు అందరిలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా సిటీల్లో ఇది ఎక్కువ. డయాబెటిస్, పొట్ట పెరగడం లాంటి సమస్యలతో చాలామంది రెండు పూటలా అన్నం తినడం మానేశారు. ఒక పూట భోజనం, మరో పూట ఛపాతి తింటున్నారు. ఇక షుగర్ పేషెంట్ల సంగతి చెప్పక్కరలేదు. కొందరైతే రెండు పూటలా రోటీలే తింటున్నారు. దీంతో సిటీలోని రేషన్‌కార్డు లబ్ధిదారులు గోధుమలు తీసుకోవడంపై ఆసక్తి చూపిస్తుండడంతో డిమాండ్పెరిగింది.
‘అంత్యోదయ’ చక్కెర అంతేనా..?
ప్రతి అంత్యోదయ లబ్ధిదారుడికి ప్రభుత్వం ప్రతి నెల కిలో చక్కెర ఇస్తోంది. నగరంలో సుమారు 80 వేల కార్డులు ఉండగా ఈసారి మూడు నెలలకు సరిపడా మూడు కిలోల చక్కెర కూడా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చక్కెర కోటా కూడా డిమాండ్‌కు సరిపడా రావడం లేదని చెప్తున్నారు. వచ్చినప్పుడు ఇస్తామని అంటున్నారు. దీంతో బియ్యం ఒకసారి తీసుకుని, చక్కెర, గోధుమల కోసం నెల నెల తిరగాలా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారను.
నీకెందుకు చెప్పాలె..
సిటీకి గోధుమల డిమాండ్ ఎంత ఉంది? కేంద్రం నుంచి ఎంత సరఫరా చేస్తున్నారు? సరిపడా ఎందుకు ఇవ్వడం లేదు అని డీఎస్వో శ్రీనివాస్ ను ప్రశ్నించగా ‘ ఇవన్నీ నీకెందుకు చెప్పాలె. నాకు తెల్వద్’ అని దురుసుగా సమాధానమిచ్చారు. ‘సిటీకి సరిపడా గోధుమల కోటా వస్తలేదు. దానికి నేనేం చేస్తా..కోటా నిర్ణయించేది నేను కాదు, కేంద్రం’ అని రుసరుసలాడుతూ ఫోన్పెట్టేశారు.
డిఫరెంట్ షేడ్స్
మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పరిచయ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘డిఫరెంట్ షేడ్స్’ పేరుతో నేషనల్ ఆర్ట్ వర్క్‌షాప్ శుక్రవారం ప్రారంభమైంది. మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు లైవ్‌లో వేసిన పెయింటింగ్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వర్క్‌షాప్ ఈ నెల 31 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. – వెలుగు, మాదాపూర్
