వరద ముప్పు నివారణకు రూ.2500 కోట్లు.. మరో 6 సిటీలకు కేటాయిస్తామన్న అమిత్​షా

వరద ముప్పు నివారణకు రూ.2500 కోట్లు.. మరో 6 సిటీలకు కేటాయిస్తామన్న అమిత్​షా

న్యూఢిల్లీ, వెలుగు: ప్రకృతి విపత్తు వల్ల ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇందులో భాగంగా దేశంలో విపత్తు నిర్వహణ కోసం రూ. 8 వేల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విపత్తు నిర్వహణ మంత్రులతో జరిగిన సమావేశంలో అమిత్ షా 3 పథకాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

రాష్ట్రాల్లో అగ్నిమాపక సేవల విస్తరణ, ఆధునీకరణకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు. మెట్రోపాలిటన్ సిటీలైన హైదరాబాద్​తో పాటు ముంబై, చెన్నై, కోల్‌‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పుణెలో వరదల ప్రమాదాన్ని తగ్గించడానికి రూ.2,500 కోట్లు ఇస్తామని తెలిపారు. నేషనల్ ల్యాండ్‌‌స్లైడ్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కింద 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.825 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. దేశంలో విపత్తుల స్వభావం మారిందని, వాటి ఫ్రీక్వెన్సీ, తీవ్రత కూడా పెరిగిందని అమిత్​షా అన్నారు. అనేక చోట్ల కొత్త విపత్తులు ఎదురవుతున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.