ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ ఐదుగురు సభ్యులతో ఏర్పాటు

ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ ఐదుగురు సభ్యులతో  ఏర్పాటు
  • ఈనెల 22న తొలి భేటీ ఉండే చాన్స్​
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రధాని మోదీ హామీ 

ఢిల్లీ: ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను ఈ కమిటీకి సభ్యులుగా నియమించింది. ఈనెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

అప్పుడు హామీ

గతేడాది నవంబర్​11న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్​లోలో ఎమ్మార్పీస్ నిర్వహించిన మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏండ్లుగా చేస్తున్న పోరాటాన్ని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో తాను కూడా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. మందకృష్ణను హత్తుకుని  మోదీ ఎమోషనల్​అయ్యారు. ఈసందర్భంగా ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా, దీనికి సంబంధించి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు పార్లమెంట్​ఎన్నికల స్టంట్​

సాంకేతిక కారణాలతో 2004 నవంబర్ 5న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కొట్టివేసింది. తాజాగా పార్లమెంట్ ఎలక్షన్స్​టైంలో ఎస్సీ వర్గీకరణ ఏర్పాటుచేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  అయితే దీనిపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎస్సీ వర్గీకరణం అంశంపై  తెరపైకి తేవడం..
పార్లమెంట్​ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  కేంద్ర కమిటీ అంటూ కొత్త డ్రామాకు తెరతీస్తున్నారని ప్రతిపక్షాలు, మాల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సబ్-కేటగిరైజేషన్ సామాజిక వైషమ్యాలకు దారి తీస్తుందని మండిపడుతున్నారు. ప్రధాని మోదీకి ఎలక్షన్స్​వచ్చినప్పుడే మాదిగలు గుర్తుకొస్తరా అంటూ ప్రశ్నిస్తున్నారు. మాదిగల్ని తనవైపు తిప్పుకోవడం ద్వారా రాజకీయ సమీకరణాల్ని మార్చాలనేది మోదీ వ్యూహం అనే విమర్శ వర్గీకరణ వ్యతిరేకుల వైపు నుంచి బలంగానే వినిపిస్తోంది.