శబరిమలలో వసతులు కల్పించండి .. కేరళ సర్కార్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి విజ్ఞప్తి

శబరిమలలో వసతులు కల్పించండి ..  కేరళ సర్కార్‌‌‌‌‌‌‌‌కు కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో కనీస వసతులు కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కోరారు. అవసరమైన ఏర్పాట్లు చేయకపోవడంతో తెలుగు రాష్ట్రాల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ఆదివారం కిషన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజీ ప్రాంగణంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా జరిగింది. గత 23 ఏండ్లుగా ఈ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి దంపతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు తెలుగు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. 

శబరిమలైలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ సీఎం పినరయి విజయన్‌‌‌‌కు లేఖ రాశానని తెలిపారు. శబరిమలలో అయ్యప్ప స్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. అంతకుముందు కిషన్ రెడ్డి దంపతులు అయ్యప్ప విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గురుస్వామి ఆత్రేయాచార్యుల చేతుల మీదుగా జరిగిన పూజా కార్యక్రమంలో గాయకుడు జడల రమేశ్‌‌‌‌ ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. 

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్‌‌‌‌, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, రఘునందన్ రావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా, అయ్యప్ప దర్శనం కోసం వెళ్లి తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసులు చనిపోవడంపై కిషన్‌‌‌‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.