డాక్టర్లు లేరు.. మెషీన్లు పనిచేస్తలేవ్!..రాష్ట్ర వైద్య రంగంపై కేంద్రం ‘కామన్ రివ్యూ మిషన్’ రిపోర్ట్ 

డాక్టర్లు లేరు.. మెషీన్లు పనిచేస్తలేవ్!..రాష్ట్ర వైద్య రంగంపై కేంద్రం ‘కామన్ రివ్యూ మిషన్’ రిపోర్ట్ 
  • గత నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో హాస్పిటల్స్ పరిశీలన 
  • కోట్లాది రూపాయల మెడికల్ ఎక్విప్మెంట్స్​వృథాగా ఉన్నట్లు గుర్తించిన టీం
  • సిజేరియన్లపై క్లినికల్ ఆడిట్ జరపాలని కేంద్రం ఆదేశం
  • 17వ కామన్ రివ్యూ మిషన్ రిపోర్ట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు దవాఖానల దుస్థితిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన 17వ కామన్ రివ్యూ మిషన్ (సీఆర్​ఎం) నివేదిక వాస్తవాలను బయటపెట్టింది. పీహెచ్‌‌‌‌‌‌‌‌సీల నుంచి జిల్లా హాస్పిటల్స్ వరకు వైద్య సేవల్లో తీవ్ర వైఫల్యాలు ఉన్నాయని రిపోర్ట్​ద్వారా తెలిపింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో... నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రాష్ట్రాల్లో కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి. నిధుల వినియోగం ఎలా ఉంది. లోటుపాట్లు ఏమున్నాయో తెలుసుకోవడానికి ప్రతి ఏడాది దేశంలోని పలు రాష్ట్రాల్లో సీఆర్ఎం టీమ్ పర్యటిస్తుంది. అందులో భాగంగా గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించింది. హాస్పిటల్స్ లో అందుతున్న సేవలను, సమస్యలను రిపోర్టు ద్వారా పేర్కొంది.

స్పెషలిస్టు డాక్టర్లు లేరు.. 

రాష్ట్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్​సీ), ఏరియా హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని రిపోర్ట్ పేర్కొంది. ముఖ్యంగా గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, అనస్థీషియా నిపుణుల పోస్టులు ఖాళీగా ఉండటంతో అత్యవసర సేవలు కుంటుపడుతున్నాయి. మరోవైపు, కమ్యూనిటీ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ ను పర్యవేక్షించాల్సిన బ్లాక్ కమ్యూనిటీ మొబిలైజర్ (బీసీఎం) పోస్టులే లేకపోవడం గమనార్హం. కాంట్రాక్ట్ సిబ్బందికి గత కొన్నేళ్లుగా వార్షిక ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం, కొత్త సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ (ఎస్ఎన్ఏ స్పర్శ్) లోపాల వల్ల జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని, ఇది సిబ్బంది నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తోందని రిపోర్టు వెల్లడింది. 

మెయింటనెన్స్ లేక ఎక్విప్మెంట్స్​మూలకు.. 

కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన మెడికల్ ఎక్విప్మెంట్స్​దవాఖానల్లో అలంకారప్రాయంగా మారాయని సీఆర్ఎం రిపోర్టు తెలిపింది. వెంటిలేటర్లు, సీ-ప్యాప్ మెషీన్లు ఉన్నప్పటికీ, మెయింటెనెన్స్ లేక అవి పనిచేయడం లేదని మిషన్ వెల్లడించింది. కరోనా సమయంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లు (ఎస్పీఏ ప్లాంట్స్) నిర్వహణ గాలికి వదిలేశారు. వీటికి యానువల్ మెయింటనెన్స్ ఒప్పందాలు లేకపోవడంతో చిన్న రిపేర్ వచ్చినా బాగు చేసే నాథుడే లేడని రిపోర్టు స్పష్టం చేసింది. ఇక.. ఏరియా హాస్పిటల్స్ లో ల్యాబ్‌‌‌‌‌‌‌‌ లు కేవలం శాంపిల్ కలెక్షన్ సెంటర్లకే పరిమితమయ్యాయని,  అక్కడ అన్ని వసతులు ఉన్నా, టెస్టులు చేయకుండా జిల్లా కేంద్రాలకు పంపిస్తున్నారని రిపోర్టులో వెల్లడించింది. ల్యాబ్ రియేజెంట్స్ (కెమికల్స్) కొరతతో అనేక మెషీన్లు మూలన పడ్డాయి. దీనివల్ల రిపోర్టులు రావడంలో ఆలస్యమై రోగులు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోందని రిపోర్టులో తెలిపారు.

లేబర్ రూముల్లో ప్రైవసీ కరువు.. 

గర్భిణులపై యంత్రాంగం అత్యంత నిర్లక్ష్యంగా ఉందని రిపోర్టు పేర్కొంది. లేబర్ రూముల్లో కనీసం కర్టెన్లు (తెరలు) కూడా లేకపోవడం వల్ల మహిళల ప్రైవసీకి తీవ్ర భంగం కలుగుతోందని కమిటీ అసహనం వ్యక్తం చేసింది. ఇక రాష్ట్రంలో నార్మల్ డెలివరీల కంటే సిజేరియన్ ప్రసవాలు (ఎల్ఎస్సీఎస్) పెరుగుతున్నాయని, దీనిపై వెంటనే క్లినికల్ ఆడిట్ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మిషన్ ఆదేశించింది. రాష్ట్రంలో 100శాతం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ఏఏఎం) ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా, అక్కడ అందాల్సిన 12 రకాల ప్యాకేజీ సేవలు ప్రజలకు అందడం లేదని రిపోర్టు తేల్చింది. కేవలం బీపీ, షుగర్ వంటి కొన్ని సేవలే అందుతున్నాయని, మెంటల్ హెల్త్, కంటి పరీక్షలు, జీరియాట్రిక్ సేవలు వంటివి ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని తెలిపింది. చాలా వెల్నెస్ సెంటర్లకు కనీసం సరిహద్దు గోడలు కూడా లేవని స్పష్టం చేసింది.

ఆరోగ్య శ్రీ పైసల్ కోట్లలో పెండింగ్... 

ప్రభుత్వ హాస్పిటల్స్ కు రావాల్సిన ఆరోగ్యశ్రీ క్లెయిమ్స్ రూ.కోట్లలో పెండింగ్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయని సీఆర్ఎం రిపోర్టు తెలిపింది. ఒక్క భద్రాచలం ఏరియా హాస్పిటల్ కే దాదాపు రూ. 2 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించింది. దీనివల్ల హాస్పిటల్స్ రోజువారీ నిర్వహణ భారంగా మారింది. రోగి కల్యాణ సమితి (ఆర్కేఎస్) నిధులు కూడా సకాలంలో విడుదల కావడం లేదని రిపోర్ట్ పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం నిధులను క్లెయిమ్ చేయడంలో కూడా రాష్ట్రం నిర్లక్ష్యం వహిస్తోందని తేలింది. మరోవైపు.. డిజిటల్ హెల్త్ పేరుతో సిబ్బందిపై పనిభారం పెంచారని,  ఒకే డేటాను అటు రాష్ట్ర పోర్టల్‌‌‌‌‌‌‌‌ లో, ఇటు కేంద్ర పోర్టల్‌‌‌‌‌‌‌‌ లో నమోదు చేయాల్సి రావడం వల్ల వైద్యం అందించాల్సిన సమయం డాక్యుమెంటేషన్‌‌‌‌‌‌‌‌ కే సరిపోతోందని రిపోర్టు పేర్కొంది. 

ఈ సేవలు మాత్రం భేష్​... 

హాస్పిటల్స్ లో సమస్యలే కాదు.. ప్రభుత్వం చేపడుతున్న కొన్ని పనులను సీఆర్ఎం రిపోర్టు ప్రశంసించింది.  రాష్ట్రంలో మంజూరైన 5,051 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను  100 శాతం అందుబాటులోకి తీసుకురావడాన్ని అభినందించింది. తొలిసారిగా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్లకు ప్రత్యేక క్లినిక్​లను ఏర్పాటు చేయడం,  మహిళలకు ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా క్లినిక్​లను విజయవంతంగా నిర్వహించడం వంటి అంశాలను కేంద్ర బృందం  ప్రశంసించింది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా హబ్-అండ్-స్పోక్ మోడల్‌‌‌‌‌‌‌‌లో 134 రకాల పరీక్షలను ఉచితంగా అందించడాన్ని మంచి నిర్ణయంగా పేర్కొంది.