
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ (MPP-మానిటరీ పాలిసీ కమిటీ)లో ముగ్గురు సభ్యులను నామినేట్ చేసింది. శశాంక భిడే, అసిమా గోయల్, జయంత్ వర్మలను నియమిస్తున్నట్టు నిన్న(సోమవారం) రాత్రి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవానికి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకూ ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్ష జరగాల్సి వుండగా… దాన్ని ప్రభుత్వం బలవంతంగా వాయిదా వేయించింది. సెప్టెంబర్ తోనే ఎంపీసీ సభ్యుల పదవీ కాలం పూర్తికాగా, కొత్త వారి నియామకంలో ఆలస్యం జరిగింది. పరపతి సమీక్షలో కనీసం నలుగురు ఎంపీసీ సభ్యులు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ప్రకారం తాజా నియామకాలను ప్రకటించింది.
కొత్తగా నియమితులైన ముగ్గురు సభ్యులూ నాలుగేళ్ల పాటు బాధ్యతల్లో ఉంటారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అసిమా గోయల్.. ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ రీసెర్చ్ లో ప్రొఫెసర్ గా పనిచేసిన తర్వాత, ప్రధాని మోడీకి ఆర్థిక సలహాదారుగానూ పనిచేశారు.
శశాంక్ భిడే, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనామిక్ అండ్ రీసెర్చ్ లో సీనియర్ సలహాదారుగా ఉన్నారు. జయంత్ వర్మ అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ విభాగం ప్రొఫెసర్ గా ఉన్నారు.