- ప్రధాని మోదీకి రిజైన్ లెటర్ పంపిన కేంద్ర విద్యా శాఖ మంత్రి
- కేంద్ర మంత్రులతో సీజేపీ చర్చలకు ముందే రాజీనామా ప్రకటన
- నెలరోజుల ఆందోళన విరమిస్తున్నట్టు సీజేపీ వెల్లడి
- డిమాండ్లన్నింటికీ అంగీకరించిన కేంద్రం
- కేసుల ఎత్తివేత, ‘నీట్ మృతుల’కు పరిహారానికీ ఓకే
- ఢిల్లీతోసహా దేశవ్యాప్తంగా సంబురాలు
న్యూఢిల్లీ: పరీక్ష పేపర్‌ల లీకులు, విద్యా వ్యవస్థ వైఫల్యాలపై అలుపెరగని పోరాటం సాగించిన దేశ యువత ఎట్టకేలకు చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. కాక్రోచ్‌లు, జెన్ జీల ఆధ్వర్యంలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచింది. విద్యార్థుల ప్రధాన డిమాండ్‌కు తలొగ్గుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేశారు.
కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, జేపీ నడ్డాను సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా కలవడానికి ముందే ప్రధాన్ రాజీనామా ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి తన రాజీనామా లేఖను పంపానంటూ ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబట్టిన యువతరం.. 35 రోజుల పోరాటం తర్వాత తన ప్రధాన డిమాండ్‌ను నెరవేర్చుకుంది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు నెల రోజులపాటు చూపిన పట్టుదల, ఐక్యత చివరకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేలా చేశాయి. ‘‘ప్రజాస్వామ్యంలో ఎవరూ అతీతులు కారు” అంటూ జెన్ జీ యువతరం రోడ్లెక్కి చేపట్టిన ఉద్యమం రాజకీయ దిగ్గజాలను కూడా తలవంచేలా చేసింది. తమ డిమాండ్లన్నింటికీ కేంద్ర మంత్రులు అంగీకరించారని సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. ప్రధాన డిమాండ్ అయిన ప్రధాన్ రాజీనామా పూర్తయిందని తెలిపారు.
అలాగే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం, ఆందోళనకారులపై ఎఫ్ఐఆర్‌ల ఎత్తివేతకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. వీటితోపాటు విద్యార్థులకు ఆర్ఏఎఫ్, ఢిల్లీ పోలీసులు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ కూడా పెండింగ్‌లో ఉందని వివరించారు. కాగా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో యువత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ‘వి వన్ (మనం గెలిచాం)’ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ, స్వీట్లు పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోనూ పెద్ద ఎత్తున వేడుకలతో సంతోషం వ్యక్తం చేశారు.
- పట్టుబట్టి సాధించారు..
నీట్ పేపర్ లీక్ అంశంపై సీజేపీ ఆధ్వర్యంలో జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు ప్రారంభమయ్యాయి. దాదాపు నెలరోజులుగా సాగిన ఈ ఉద్యమం గత పది రోజులుగా ఉధృతమైంది. ఈ నెల 20న చలో పార్లమెంట్ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌తో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పరీక్షల్లో అవకతవకల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి ప్రకటించారు. ప్రధాని ప్రకటన ప్రకారం.. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించే బిల్లుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.
మొత్తంగా ఆందోళనలు తీవ్రం కావడంతో సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్ మూడు దఫాలుగా చర్చలు జరిపారు. ప్రధాన్ రాజీనామా చేస్తేనే చర్చలకు వస్తామని సీజేపీ శనివారం ఉదయం తేల్చిచెప్పింది. దీంతో కేంద్ర మంత్రులతో సీజేపీ సమావేశానికి ముందే ప్రధాన్ రాజీనామా ప్రకటన చేశారు. అనంతరం జరిగిన చర్చల్లో సీజేపీ డిమాండ్లకు కేంద్రం అంగీకరించింది. దీంతో 36 రోజుల ఆందోళనను విరమిస్తున్నట్టు సీజేపీ ప్రకటించింది.
దేశ వ్యతిరేక శక్తులకు చాన్స్ ఇవ్వొద్దనే రిజైన్ చేశా: ప్రధాన్
ప్రధాని మోదీకి తాను రాసిన సుదీర్ఘ రాజీనామా లేఖను ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. గడచిన పది రోజులుగా జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని, ఈ సమస్య తన వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించినది కాదని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ పరిస్థితిని భారత వ్యతిరేక శక్తులు అనుకూలంగా మలచుకోకూడదనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
‘‘దేశ ఐక్యత చెక్కుచెదరకుండా ఉండాలని.. ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకూడదని.. విద్యార్థులు తమ సమయాన్ని చదువులకు, కెరీర్ నిర్మాణానికి కేటాయించాలని కోరుకుంటున్నా. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రికి నా రాజీనామా లేఖ పంపాను” అని ఆయన పేర్కొన్నారు. కాగా, ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉండగా.. 2024లోనూ నీట్, నెట్ పేపర్ లీక్ ఆరోపణలు వచ్చాయి.
