- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ (సీఎంపీఎస్ -1998) కింద పెన్షన్ రివిజన్ చేసే ప్రపోజల్ ఏదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022లో చేసిన యాక్చురియల్ వాల్యుయేషన్ ప్రకారం పెన్షన్ ఫండ్‌లో లోటు కారణంగా పెంపు సాధ్యం కాలేదన్నారు. అయితే, 2024 మార్చి 8 నుంచి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్‌ను రూ. వెయ్యికి పెంచినట్లు తెలిపారు.
అలాగే, సింగరేణిలో సీఎస్ఆర్ నిధుల కింద రూ. 53.40 కోట్లతో 15 వేల మంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు. బొగ్గు గనుల శాఖ పరిధిలోని ఎన్‌ఎల్‌సీఐఎల్ సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిరుద్యోగ యువతకు ‘ఆటోమొబైల్ మెకానిక్’ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్టు కేంద్రం తెలిపింది. అలాగే, కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో తెలంగాణలోని సంగారెడ్డిలో 800 మంది మహిళలకు స్కిల్ ట్రైయినింగ్ ప్రోగ్రాం కింద టైలరింగ్ నేర్పిస్తున్నట్టు వెల్లడించారు.
పీడీఎస్ బియ్యంపై ఒక్క ఫిర్యాదు రాలే..
గత మూడేండ్లుగా తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా అవుతున్న పీడీఎస్ బియ్యం నాణ్యతపై ఒక్క ఫిర్యాదు రాలేదని కేంద్రం వెల్లడించింది. తెలంగాణ డీసీపీ రాష్ట్రం కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వమే 100 శాతం నాణ్యత తనిఖీలు నిర్వహించి ధాన్యాలను కొనుగోలు, నిల్వ చేస్తోందని తెలిపింది. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం చెప్పారు. పీడీఎస్ వ్యవస్థలో నాణ్యత, పారదర్శకత పెంచేందుకు విజిలెన్స్ కమిటీలు, ఈ–పాస్ యంత్రాలు, ఆధార్ ఆధారిత పంపిణీ, ఆన్‌లైన్ ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ, ‘మేరా రేషన్’ యాప్ అమల్లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. కాగా, ఫుడ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా (ఎఫ్ సీఐ), రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త బృందాలు నిల్వ కేంద్రాల్లో నిర్వహించిన తనిఖీల్లో 2022–23లో 542, 2023–24లో 380, 2024–25లో 482, 2025–26లో (జనవరి వరకు) 268 తనిఖీలు జరిగాయని తెలిపారు. ఈ తనిఖీల్లో మనుషులు తినడానికి పనికిరాని బియ్యం నిల్వలు నామమాత్రంగానే ఉన్నాయని గణాంకాల్లో చూపారు.
