తెలంగాణ పంటల కొనుగోలులో కేంద్రం వివక్ష..పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి: మంత్రి తుమ్మల

తెలంగాణ పంటల కొనుగోలులో కేంద్రం వివక్ష..పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోండి: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని రకాల పంటలను కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, అయితే రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటలను వివక్ష లేకుండా కేంద్రం స్వీకరించాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి, కొత్త గిడ్డంగులు, వేర్‌‌హౌస్‌‌ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు.

సోమవారం హైదరాబాద్‌‌లోని మార్క్‌‌ఫెడ్ కార్యాలయంలో పంటల కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం, మంత్రి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను రాష్ట్రాలపై మోపడం సరికాదన్నారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పీ)కు రాష్ట్ర ప్రభుత్వాలు పంటలను కొనుగోలు చేస్తే, ఆ భారం రాష్ట్రాలపై పడే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన 15 లక్షల టన్నుల మొక్కజొన్న, 2 లక్షల  టన్నుల జొన్నలను కేంద్ర ప్రభుత్వం వెంటనే స్వీకరించాలని కోరారు. పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లపై పరిమితులు విధించకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌‌నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. తెలంగాణ రైతులు దేశంలో ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచారని గుర్తుచేసిన మంత్రి.. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు.