- నీళ్ల పంచాయితీపై కేంద్రం కమిటీ.. 13 మందితో ఏర్పాటు.. కమిటీ అధ్యక్షుడిగా సీడబ్ల్యూసీ చైర్మన్
- ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు చొప్పున అధికారులకు చోటు
- కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ సీఈలూ సభ్యులు
- మూడు నెలల్లో రిపోర్ట్ సమర్పించాలని కమిటీకి జలశక్తి శాఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అధ్యక్షుడిగా సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్ వ్యవహరించనున్నారు. శుక్రవారం 13 మందితో కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025 జులై 16న జరిగిన సీఎంల స్థాయి మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయానికి తగ్గట్టుగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణ, ఏపీ నుంచి నలుగురు చొప్పున అధికారులను కమిటీలో సభ్యులుగా నియమించింది.
తెలంగాణ నుంచి ఇరిగేషన్ శాఖ అడ్వైజర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, ఈఎన్సీ జనరల్‌కు సభ్యులుగా అవకాశం కల్పించింది. అయితే, ఏడుగురు సభ్యులను నామినేట్ చేస్తూ 2025 డిసెంబర్ 23న కేంద్ర జలశక్తి శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా లేఖ రాశారు. ప్రస్తుతం కమిటీలో ఇప్పుడున్న నలుగురితోపాటు ఇరిగేషన్ శాఖ జాయింట్ సెక్రటరీ, ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్సెస్ వింగ్ ఎస్‌ఈ, గోదావరి డిప్యూటీ డైరెక్టర్లనూ ప్రతిపాదించారు.
కమిటీలో మాత్రం తొలి నలుగురికే కేంద్రం అవకాశం ఇచ్చింది. ఇక, ఏపీ నుంచి వాటర్ రీసోర్సెస్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అడ్వైజర్, ఈఎన్సీ జనరల్, ఇంటర్ స్టేట్ సీఈలను సభ్యులుగా కేంద్రం నియమించింది. వారితోపాటు కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ సీఈలను మెంబర్లుగా, సీడబ్ల్యూసీ సీఈని మెంబర్ సెక్రటరీగా కేంద్రం నియమించింది.
3 నెలల్లో రిపోర్ట్
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై కమిటీ సమావేశాలను నిర్వహించనున్నది. సమస్యలను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించనున్నది. న్యాయబద్ధమైన జల పంపిణీకి సూచనలు చేయనున్నది. సమావేశాల్లో భాగంగా సభ్యులు వ్యక్తపరిచిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని 3 నెలల్లోగా రిపోర్టును సమర్పించాలని కేంద్రం గడువు విధించింది.
సమావేశాల సందర్భంగా ఇతర సంస్థలు లేదా డిపార్ట్‌మెంట్లకు చెందిన అధికారులను ఆహ్వానించే అధికారాన్ని కమిటీకి కేంద్రం అప్పగించింది. ఈ సమావేశాలకు అయ్యే ఖర్చును సభ్య రాష్ట్రాలు, డిపార్ట్‌మెంట్లే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
