- రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చిన డీఓపీటీ
- మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు ఇప్పటికే
- అనుమతించిన గవర్నర్‌ప్రధాన నిందితుడిగా కేటీఆర్, అరవింద్ కుమార్ సహా
- ఆరుగురిపై అభియోగాలు త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న ఏసీబీ అధికారులు
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా–ఈ కారు రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఇందులో రెండో నిందితుడైన ఐఏఎస్ అరవింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం ఓకే చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) శనివారం సమాచారం అందించింది.కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడి(ఏ-1)గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇప్పటికే అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు పర్మిషన్ లభించింది. రాష్ట్ర జీఏడీకి నుంచి డీవపీటీ పర్మిషన్ లెటర్ అందిన వెంటనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. కేటీఆర్, అరవింద్ కుమార్‌తోపాటు కేసులో మూడో నిందితుడైన హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీ లక్ష్మీ నర్సింహారెడ్డి (బీఎల్‌ఎన్ రెడ్డి), గ్రీన్‌కో ఏస్ నెక్స్ట్‌జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను నిందితులుగా చేర్చుతూ అభియోగాలు దాఖలు చేయనున్నారు. చార్జిషీట్ దాఖలు చేస్తారా? లేదా దర్యాప్తులో భాగంగా కేటీఆర్, అరవింద్ కుమార్‌ను అరెస్ట్ చేసేందుకు కోర్టు అనుమతి కోరుతారా? అనే చర్చ నడుస్తున్నది.
ఫార్ములా ఈ ఆపరేషన్ అగ్రిమెంట్లతో మొదలు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్ వద్ద ఫార్ములా ఈ కార్ రేస్ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. నిబంధనలు ఉల్లంఘించి హైద రాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కి చెందిన రూ.54.89 కోట్ల నిధులు విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్‌ఎండీఏ నిధుల దుర్వియోగంపై ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ దానకిశోర్ 2024 డిసెంబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగానికి బాధ్యులుగా.. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా, అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను రెండో నిందితుడిగా, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని మూడో నిందితుడిగా చేర్చింది. ఈ ముగ్గురితోపాటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఆర్గనైజర్ గ్రీన్‌కో ఏస్ నెక్స్ట్‌జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను ఏసీబీ విచారించింది. అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రధానంగా కేటీఆర్ పేరును ప్రస్తావించారు.
నిందితుల వాంగ్మూలాలు,
సాంకేతిక ఆధారాలతో చార్జిషీట్
కేటీఆర్ ఆదేశాల మేరకే తాను నిర్ణయాలు తీసుకున్నట్టు అరవింద్ కుమార్ వాంగ్మూలాలు ఇచ్చారు. ఇదే అంశాన్ని కేటీఆర్ కూడా ఏసీబీ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ప్రధానంగా ఈవెంట్ నిర్వహణ కోసం స్పాన్సర్ ఫీజు, ట్యాక్స్‌లు కలిపి మొత్తం రూ.110 కోట్లు (గ్రేట్ బ్రిటన్ పౌండ్ 90,00,000) చెల్లించే విధంగా అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఈవెంట్ నిర్వహణ కోసం మున్సిపల్ సర్వీసెస్, సివిల్ వర్క్స్ కోసం మరో రూ.50 కోట్లు ఖర్చు చేసేలా అండర్ టేకింగ్ తీసుకున్నట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. వీటితోపాటు హెచ్‌ఎండీఏ బోర్డు నిధుల నుంచి రూ.160 కోట్లు అప్రూవల్ ఒప్పందం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో లండన్‌కు 45 కోట్ల71 లక్షల 60 వేల 625 రూపాయలు తరలింపు, హెచ్‌ఎండీఏకి రూ.8.07 కోట్లు ఐటీ జరిమానా సహా మొత్తం రూ.54 కోట్ల88 లక్షల 87 వేలు దుర్వినియోగం గురించి ప్రధాన అభియోగాలు మోపనున్నది. దీంతోపాటు ఈ కార్ -రేసింగ్‌తో హెచ్ఎండీఏకు ఎలాంటి లాభం లేకపోగా.. రూ.75.88 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో గ్రీన్ కో సంస్థ నుంచి క్విడ్ ప్రోకో రూపంలో రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు బీఆర్‌ఎస్‌కు వచ్చినట్లు ఆధారాలు కలెక్ట్ చేసింది. వీటికి సంబంధించిన పూర్తి సాంకేతిక ఆధారాలతో కూడిన చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేస్తున్నది.
