సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కేంద్రం ఝలక్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కేంద్రం ఝలక్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కేంద్రం షాకిచ్చింది. ఇకపై ఆయా ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పంద వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. ఇన్‌ఫ్లుయెన్సర్లు పొందే గిఫ్ట్‌, హోటల్‌ అకామిడేషన్‌, ఈక్విటీ, డిస్కౌంట్స్‌, అవార్డులు, ఎండార్సింగ్‌ ప్రొడక్ట్స్‌, సర్వీస్‌ స్కీమ్‌ వంటి వివరాలను చెప్పాలని పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, వర్చువల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం ‘‘ఎండార్స్‌మెంట్ నో హౌస్’’ పేరుతో కొత్త మార్గదర్శకాలను వినియోగదారుల వ్యవహారాల శాఖ జారీ చేసింది. 

దేశీయంగా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెట్‌ 2025 నాటికి 20 శాతం వృద్ధి సాధించి రూ.2,800కోట్లకు చేరుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర విభాగానికి చెందిన సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటక్షన్‌ అథారిటీ తప్పుదోవ ప్రకటించే ప్రకటనలపై దృష్టిసారించింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కొత్త నిబంధనలు విధించింది.

ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీ లేదా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే 2019 నాటి వినియోగ‌దారుల ర‌క్షణ చ‌ట్టం ప్రకారం చర్యలు తీసుకోనుంది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ.. కంపెనీకి, ప్రచారకర్తకు 10 లక్షల నుంచి  50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. దాంతోపాటు ఏడాది నుంచి మూడేళ్ల వరకు నిషేధం విధించనుంది.