- ఓటు వేసేందుకు వెళ్లిన బెంగాల్ కార్మికులు రాలేదు
- బంగ్లాదేశ్ నుంచి జూట్ రాక.. నిలిచిపోయిన గన్ని బ్యాగుల సప్లై
- డీజిల్ కొరతతో లారీలు వారానికి పైగా ఆగాయని వెల్లడి
ఖమ్మం, వెలుగు: కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లాలోని యాతాలకుంట టన్నెల్పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. బెంగాల్ కు చెందిన కార్మికులే ఇక్కడ ఎక్కువగా హమాలీలుగా పనిచేస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన వారెవరూ తిరిగి రాలేదని తెలిపారు.
బంగ్లాదేశ్ నుంచి జూట్ సప్లై నిలిచిపోవడంతో గన్నీ బ్యాగుల కొరత ఏర్పడిందని, యుద్ధం వల్ల డీజిల్ లేక వారానికి పైగా లారీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయని చెప్పారు. కేంద్రం మద్దతు ధర ప్రకటించడం తప్ప పంటలు కొనడం లేదన్నారు. రైతుల సమస్యలను రాజకీయాలకు ఉపయోగించుకోవడం సిగ్గుచేటని, ఏ మొహం పెట్టుకొని బీజేపీ నేతలు బస్సు యాత్రలు చేస్తున్నారని తుమ్మల నిలదీశారు.
యాతాలకుంట టన్నెల్ పనుల పరిశీలన
ఈ ఏడాది ఆగస్టు 15లోపు యాతాలకుంట టన్నెల్ లైనింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామంలో నిర్మిస్తున్న టన్నెల్ పనులను చూశారు. ఖమ్మం కలెక్టర్దివాకర్ , భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణలను తీసుకుని మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ టన్నెల్ లోపలికి వెళ్లారు.
ఈ టన్నెల్‌కు రూ. 13వేల కోట్లతో 2016లో అనుమతులు వచ్చినా గత ప్రభుత్వ హయాంలో పనులు చేయలేదన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని, మరో 7 నుంచి 8 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. రాజీవ్ లింక్ కాలువ ఆరు నెలల్లో పూర్తి చేశామని, వచ్చే జూన్ నాటికి గోదావరి నీటితో వైరా ప్రాజెక్టు నింపి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. యాతాలకుంట టన్నెల్ పూర్తయితే మరో లక్ష ఎకరాలకు నీరందుతుందని తెలిపారు.
వచ్చే వర్షాకాలానికే యాతాలకుంట టన్నెల్ ద్వారా గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు చేరాలనేది తన కోరిక అని చెప్పారు. జూలూరుపాడు టన్నెల్ టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని, యాతాలకుంట టన్నెల్ లైనింగ్ జరగగానే జూలూరుపాడు టన్నెల్ పనులు వేగవంతం అవుతాయని తుమ్మల అన్నారు. భూసేకరణ సమస్యలను త్వరగా పరిష్కరించి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వసుంధర యాదవ్ పాల్గొన్నారు.
