వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం

వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం

న్యూఢిల్లీ: వంట నూనెల ధరలను దింపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వంట నూనెల ధరలు ఆకాశానికి ఎగబాకడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జనానికి ఊరట కలిగించే చర్యలకు శ్రీకారం చుట్టింది. రానున్న పండుగల సీజన్ లోగా వంట నూనెల ధరలను అదుపు చేసేందుకు దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ముడినూనెలతో పాటు రీఫైండ్‌ నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకంలో బేస్‌ డ్యూటీని 10 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించినట్లు, అలాగే ముడి సోయా ఆయిల్‌, ముడి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై కూడా బేస్‌ దిగుమతి సుంకాన్ని 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించినట్లు సమాచారం. మూడు రకాల ముడి నూనెల దిగుమతిపై సుంకం 24.75 శాతానికి తగ్గించినట్లు తెలుస్తోంది. ముడి రకం నూనెలతో పాటు రీఫైండ్‌ రకం నూనెల దిగుమతిపై కూడా సుంకాన్ని 37.5 శాతం నుంచి 32.5 శాతానికి తగ్గించినట్లు సమాచారం. రీఫైండ్ రకం వంట నూనెలు అంటే... వాటిని దిగుమతి చేసుకుని శుద్ధి చేసి నేరుగా మార్కెట్‌లో అమ్ముకోవాల్సి ఉంటుంది. కేంద్రం నిర్ణయంతో మార్కెట్లో వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టే పరిస్థితి ఏర్పడింది.