- ప్రధాని మోదీ పొదుపు విన్నపంపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'పొదుపు' విన్నపంపై కేంద్ర ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. దేశంలో ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని తెలిపింది. భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని వనరులను పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చింది. ప్రధాని సూచనలు దేశ హితం కోసమేనని పేర్కొంది.
సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్ర మంత్రుల బృందం సమావేశమైంది. ఈ మీటింగులో పశ్చిమాసియా సంక్షోభం, దానివల్ల భారత్‌కు తలెత్తే ఇంధన భద్రత సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించింది. చర్చ అనంతరం రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరాపై తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది.
దేశంలో ఇంధన సరఫరాకు ఎటువంటి ఢోకా లేదు. కొరత ఏర్పడకుండా మేం అత్యంత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. అయితే, వనరులను పొదుపుగా వాడుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలి. ఇంధనం, ఇతర కీలక వనరుల సంరక్షణ విషయంలో ప్రజలందరూ సమష్టిగా భాగస్వాములు కావడం ద్వారానే మనం ఇంధన భద్రతను సాధించగలం. ప్రధాని మోదీ కేవలం పొదుపు మంత్రం మాత్రమే చెప్పలేదు. కష్టకాలంలో దేశం స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి వనరుల పొదుపు అనేది ఒక కీలకమైన వ్యూహం. హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఆంక్షల వల్ల ఇంధన సరఫరాపై కొంత ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. కానీ దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం వద్ద స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనందరం క్రమశిక్షణతో కూడిన అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచగలం’ అని పేర్కొన్నారు.
