ఆదివాసీ హక్కులను కాలరాస్తున్న కేంద్రం.. సాగు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేయాలి

ఆదివాసీ హక్కులను కాలరాస్తున్న కేంద్రం.. సాగు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేయాలి
  •  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
  •     ఏటూరునాగారం ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు

ఏటూరునాగారం, వెలుగు : తరతరాలుగా అడవిని నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎంపీ మీడియం బాబురావు ఆరోపించారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు మంజూరు చేయాలని, ఫారెస్ట్ ఆఫీసర్ల దాడులు ఆపాలని, ఆదివాసీల రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాసే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్​చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏను ముట్టడించారు. 

ముందుగా ములుగు జిల్లా ఏటూరునాగారంలోని వై జంక్షన్​నుంచి ర్యాలీగా ఐటీడీఏ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ సీపీఎం నాయకులతో చర్చించి, ఆదివాసీల సమస్యలను పరిష్కరించడానికి సానుకూలంగా ఉన్నామని, సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతోందన్నారు. 

11 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే గత ప్రభుత్వం కేవలం నాలుగు లక్షల మందికే ఇచ్చి చేతులు దులుపుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తే గిరిజనులు, గిరిజనేతరులందరికీ హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వడం లేదన్నారు. 

ఫారెస్ట్ ఆఫీసర్లు ఆదివాసీలను వేధించడం, సాగు భూముల్లో ప్లాంటేషన్ చేయడం, వారిని భూముల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేయడం అన్యాయమని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. దావూద్, రత్నం రాజేందర్, గ్యానం వాసు, పొదిళ్ల చిట్టిబాబు, రఘుపతి, గొంది రాజేశ్ పాల్గొన్నారు.