- సికింద్రాబాద్, చార్మినార్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ముందస్తు సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్‌లో చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్ సర్వేను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌తో కలిసి శనివారం ఆయన సికింద్రాబాద్‌లోని మాణికేశ్వర్ నగర్, చార్మినార్‌లోని కబుత్తర్ ఖానా పరిధిలో క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులు, సూపర్ వైజర్లతో మాట్లాడి మ్యాపింగ్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. 2002 నాటి జాబితాలోని ఓటర్ల కుటుంబ సభ్యుల వివరాలను ప్రస్తుత 2025 జాబితాతో పోల్చుతూ మ్యాపింగ్ చేస్తున్నామని అధికారులు సీఈఓకు వివరించారు.
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ ప్రక్రియలో కచ్చితత్వం, పారదర్శకత పాటించాలని సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఓటరు జాబితాల్లో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా సవరణలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ చంద్రకళ, ఈఆర్ఓలు సరిత, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
