కౌంటింగ్ సెంటర్లకు మూడంచెల భద్రత: వికాస్ రాజ్

కౌంటింగ్ సెంటర్లకు మూడంచెల భద్రత: వికాస్ రాజ్
  •  హైదరాబాద్ లోనే 14 ఏర్పాటు చేశాం
  • ప్రతి టేబుల్ వద్ద ఐదుగురు సిబ్బంది
  • రాష్ట్ర వ్యాప్తంగా 70.79% పోలింగ్ 
  • గతంతో పోల్చితే 3% తగ్గిన ఓటింగ్
  • మీడియాతో సీఈవో వికాస్ రాజ్

హైదరాబాద్: డిసెంబర్ 3 ఉదయం రాష్ట్రంలోని 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నామని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఇందులో 14 కేంద్రాలు హైదరాబాద్ లో ఉన్నాయని వివరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి టేబుల్ వద్ద ఐదుగురు సిబ్బంది విదుల్లో ఉంటారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 70.79% పోలింగ్ నమోదైనట్టు తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో 73.37% పోలింగ్ శాతం ఉందని, గతంతో పోల్చితే మూడు శాతం తక్కువేనని ఆయన అన్నారు. పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయని దీంతో వాటిని మార్చామని తెలిపారు.

 దేవరకద్ర నియోజకవర్గంలో పది మంది ఓటర్లున్నా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పోలింగ్ పూర్తవగానే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించామని, ప్రస్తుతం ఈవీఎంలు 40 కేంద్ర కంపెనీల బలగాలు భద్రతలో ఉన్నాయని చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత రెండో సారి లెక్కిస్తామని అన్నారు.  ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తామని చెప్పారు. చాంద్రాయణగుట్ట లో జరిగిన  రిగ్గింగ్ పై నివేదిక ఆడిగామని, సంబంధిత ఆర్వో,అబ్జర్వర్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోబోతున్నట్టు సీఈవో తెలిపారు.