హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పర్యాటక శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకూ పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగానే రిటైర్ మెంట్ ఏజ్‌ను 61 ఏండ్లకు పెంచాలని సీపీఐ నాయకుడు, టూరిజం ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. టూరిజంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ ఉత్తర్వులు వచ్చిన సందర్భంగా ఆయన శుక్రవారం టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎండీకి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. చాడ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచడం హర్షణీయమన్నారు. ఇది తెలంగాణ టూరిజం కార్పొరేషన్ యూనియన్ చేసిన రాజీలేని పోరాట ఫలితమేనని అన్నారు. ఇదే స్ఫూర్తితో కాంట్రాక్ట్ ఉద్యోగుల వయో పరిమితిని కూడా 61 ఏండ్లకు పెంచి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
