- సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్,- బీజేపీ పరస్పర బూతులు, దాడులపై సమగ్రమైన విచారణ జరిపించాలని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్ రైతు సభలో కాంగ్రెస్‌ను కేటీఆర్ విమర్శించడం, బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ విమర్శించడం, కేటీఆర్‌ను బండి సంజయ్ విమర్శించడం, బండి సంజయ్‌ను కౌశిక్ రెడ్డి బూతులతో విమర్శించడం వంటి ఘటనలు రాజకీయ విలువలను దిగజార్చాయని మండిపడ్డారు.
బండి సంజయ్ వర్గం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయం ముందు కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేయడం అన్యాయమని, రాజకీయ విలువలు లేకుండా దూషించుకునే సంస్కృతిని చాడ తీవ్రంగా ఖండించారు. బూర్జువా పార్టీలు దిగజారిన రాజకీయాలతో ఇలాంటి దాడులకు తెగబడటంతో భవిష్యత్తు రాజకీయాలు ప్రశ్నార్ధకంగా మారాయన్నారు. ఇప్పుడే ఎన్నికలు వస్తున్నాయన్న విధంగా రాజకీయాలు వేడెక్కాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని సమగ్రమైన విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
