మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లతోనే జతకడతాం

మున్సిపల్ ఎన్నికల్లో వాళ్లతోనే జతకడతాం

బీజేపీ ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ బిల్లు మత వ్యతిరేక చట్టమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కరీంనగర్ లోని సీపీఐ భవన్ లో చాడ వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… అసోంలో ఇప్పటి వరకు 19లక్షల మందికి పౌరసత్వం ఇవ్వలేదన్నారు. బతకడానికి వచ్చిన శరణార్థులకు ఒక టైం పెట్టి వాళ్ళకు పౌరసత్వం ఇవ్వాలన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం బిల్లును ఆనాడు వ్యతిరేకించి.. ఇప్పుడు అమలు చేసే విషయంలో మౌనంగా ఉంటున్న కేసీఆర్ మౌనముద్ర వీడి సీఏఏపై తన వైఖరి చెప్పాలన్నారు చాడ. అలాగే కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపడుతాడన్న మంత్రుల ప్రచారంపై,  వారసత్వం రాజకీయాలపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలన్నారు. సీపీఐ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని అన్నారు.

తెలంగాణలో ఎన్నో సమస్యలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని,  రైతులకు రైతు బంధు, రుణమాపీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని చాడ అన్నారు. “రైతు బంధు పథకం పైన ఐదు ఎకరాలు ఉన్న వారికే ఇస్తానని షరతులు విధిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు మూసేస్తున్నారు. 27 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు బకాయిలు పేరుకుపోయి పనులు నిలిచిపోయాయి. కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితం కావడంతో..  తెలంగాణలో ప్రగతికి విఘాతం కలుగుతోందని” అన్నారు వెంకట రెడ్డి.

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల ధన్యం కావాల్సింది కేసీఆర్ జీవితం కాదని, ప్రజల జీవితాలు ధన్యం కావాలని చాడ ఈ సందర్భంగా అన్నారు. కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంపై సీపీఐ ఉద్యమాలు చేపడుతుందన్నారు. “తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల్లో..  బీజేపీకి హటావో దేశ్ కి  బచావో అనే వాళ్లతో సీపీఐ కలిసి వెళుతుంది. మా పార్టీలో చర్చించి.. కలిసి వచ్చే పార్టీలతో పరస్పర చర్చల ద్వారా పోటీ చేస్తాం” అని వెంకటరెడ్డి అన్నారు.