
- షేర్ మార్కెట్‌లో నష్టంతో పెరిగిన అప్పులు
- దొంగను అరెస్ట్ చేసిన శంషాబాద్ పోలీసులు
- 12 తులాల గోల్డ్.. పల్సర్ బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం
శంషాబాద్, వెలుగు: యూట్యూబ్‌లో చోరీల వీడియోలు చూసి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని శంషాబాద్ జోన్ సీసీఎస్ నందిగామ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శంషాబాద్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీసీఎస్ పోలీసులు, డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ పాండురంగనగర్‌కు చెందిన కురుమాటి వెంకటరావు యాదవ్ 2016 నుంచి 2022 వరకు స్విగ్గిలో డెలివరీ బాయ్‌గా ఉద్యోగం చేశాడు. ఇతడికి 2013 లో మాలతితో వివాహం కాగా.. ఒక బాబు ఉన్నాడు. ఉద్యోగం మానేసి మాదాపూర్‌లోని పర్వత నగర్‌లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేశాడు. అనంతరం షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో అప్పులు ఎక్కువయ్యాయి. చెడు అలవాట్లకు బానిసై సులువుగా డబ్బు సంపాదించాలని యూట్యూబ్‌లో చోరీల వీడియోలు చూసి చైన్ స్నాచింగ్‌లు చేయడం మొదలెట్టాడు.
సైబరాబాద్ కమిషనరేట్ మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో 3.5 తులాల బంగారం.. కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 తులాలు.. నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 తులాలు.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2.5 తులాల దొంగతనం చేశాడు. నిందితుడి నుంచి ఒక మొబైల్, ఒక పల్సర్ బైక్, మొత్తం12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఇప్పటికే నిందితుడిపై అయిదు కేసులు నమోదయ్యాయని, పీడీ యాక్ట్ పెట్టేందుకు కమిషనర్‌తో చర్చిస్తామన్నారు. చైన్ స్నాచింగ్ కేసు ఛేదించడంలో కృషి చేసిన సీసీఎస్ పోలీసులు, నందిగామ పోలీసులకు రివార్డులు అందజేశారు.