
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్ 130వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆదివారం( సెప్టెంబర్ 28) ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి వీరనారి ఐలమ్మ చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా ఇనగుర్తి మధు రాసిన రజకుల ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ పుస్తకాన్ని మంత్రి పొన్నం ఆవిష్కరించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సామాజిక అభివృద్ధికి చాకలి ఐలమ్మ ఉద్యమ పోరాటం నేటికి స్ఫూర్తి నిస్తుందన్నారు. భూమికోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం నిరంకుశ పాలనపై పోరాడిన ధీర వనితగా సామాజిక న్యాయం కోసం మహిళలకు గౌరవం భంగం కలిగితే తిరుగుబాటు చేసిందని ఐలమ్మను కొనియాడారు. 130 ఏళ్ల తర్వాత కూడా ప్రభుత్వం తరుపున ఆమె జయంతికి నివాళులర్పించుకుంటు న్నాం.. ఆమె గొప్ప పోరాట యోధురాలు అని ఆమె త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య,
బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్,ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, బీసీ జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ , బీసీ సంక్షేమ శాఖ కమీషనర్ బాల మాయాదేవి, కేతూరి వెంకటేష్ , రజక అభివృద్ధి సంస్థల అధ్యక్షుడు మువరపు నరసింహ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య, అక్కరాజు శ్రీనివాస్, బంగారు బాపు,జూపల్లి రాజశేఖర్ కొనే సంపత్, వివిధ జిల్లాలకు చెందిన రజక నేతలు, అధికారులు పాల్గొన్నారు.