ఎస్‌ఎఫ్ఐ చలో అసెంబ్లీ ఉద్రిక్తం

ఎస్‌ఎఫ్ఐ చలో అసెంబ్లీ ఉద్రిక్తం
  • విద్యార్థి సంఘ నేతల అరెస్టు 

హైదరాబాద్, వెలుగు: ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌‌షిప్‌లు, రీయింబర్స్ మెంట్ బకాయిలు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి సంఘాల నేతలు ఒక్కసారిగా ర్యాలీగా రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో వారిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పలువురిపై పోలీసులు భౌతిక దాడులకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. 

విద్యార్థినులు అని కూడా చూడకుండా వారిని బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లలో ఎక్కించారన్నారు. కొన్ని జిల్లాల్లో రాత్రి నుంచే ఎస్‌ఎఫ్‌ఐ నేతలను అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వారిని అరెస్టు చేసి గోషామహల్, చిక్కడపల్లి, నాంపల్లి, ముషీరాబాద్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌‌ఎల్ మూర్తి, టి.నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడేండ్ల నుంచి రూ.5,177 కోట్ల స్కాలర్‌‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు ఒక్క నెల కూడా పెండింగ్‌లో లేవన్నారు.