- అధికారం పోయిందన్న బాధలో ఆయనకు నిద్ర కూడా పట్టట్లే: చామల
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలువెత్తు విషాన్ని చిమ్ముతూ అబద్ధాల రావులా మాట్లాడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లొచ్చాక మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, అధికారం పోయిందన్న బాధతో ఆయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి చామల మాట్లాడారు.
కాంగ్రెస్ హయాంలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కేసీఆర్ తనను తాను విశ్వేశ్వరయ్య అనుకొని కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్ మోదీని కలిశారని, అందుకే ఆయనను ‘బడే భాయ్’ అన్నారన్నారు. ఎర్రవెల్లిలో కేసీఆర్‌కు, జనవాడలో కేటీఆర్‌కు, మొయినాబాద్‌లో హరీశ్ రావుకు, శంకర్‌పల్లిలో కవితకు ఫామ్ హౌస్ ఉందని, కేసీఆర్ కుటుంబానికి రూ.వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
కబ్జాల కోసమే ఫార్మా సిటీ: మల్‌రెడ్డి రంగారెడ్డి
మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాదు.. ఆయన మందిని ముంచేరెడ్డి అని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మండిపడ్డారు. ఫార్మా సిటీ పేరుతో వందల ఎకరాల భూములను దోచుకున్నారని, కొంగరకలాన్‌లో రూ.2 వేల కోట్లు, ఇబ్రహీంపట్నంలో రూ.వెయ్యి కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఆదిబట్ల సర్వే నంబర్ 44లోని 11 ఎకరాల ప్రభుత్వ భూమిని, భూదాన్ భూములను కూడా వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నా వెంట రా.. మీరు ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారో చూపిస్తానని తప్పు నాదుంటే ముక్కు నేలకు రాస్తానని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
