షాంపేన్‌‌ బాటిల్‌‌తో ఫైనల్‌‌కు : 1983 వరల్డ్‌‌కప్‌‌ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కపిల్‌‌

షాంపేన్‌‌ బాటిల్‌‌తో ఫైనల్‌‌కు : 1983 వరల్డ్‌‌కప్‌‌ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న కపిల్‌‌

ముంబై: ఇండియాకు తొలి వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ అందించి, దేశ క్రికెట్‌‌‌‌ గతినే మార్చిన లెజెండరీ ప్లేయర్‌‌‌‌ కపిల్‌‌‌‌ దేవ్‌‌‌‌. ఇంగ్లండ్‌‌‌‌లో జరిగిన 1983 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో  ఆటగాడిగా, కెప్టెన్‌‌‌‌గా జట్టును కపిల్‌‌‌‌ అద్భుతంగా నడిపించాడు. తాము కచ్చితంగా కప్పు నెగ్గుతామని విశ్వసించాడు.  సహచరుల్లోనూ స్పూర్తి నింపాడు.  అందుకే వెస్టిండీస్‌‌‌‌తో ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు అతను షాంపేన్‌‌‌‌ బాటిల్‌‌‌‌తో వచ్చాడు. ఈ విషయాన్ని కపిల్‌‌‌‌ స్వయంగా చెప్పాడు.  ‘ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ కోసం ఉదయం మైదానంలోకి వచ్చేప్పుడే బ్యాగులో షాంపేన్‌‌‌‌ బాటిల్‌‌‌‌ కూడా తీసుకెళ్లా. మ్యాచ్‌‌‌‌ గెలుస్తామన్న నమ్మకం కెప్టెన్‌‌‌‌గా నాకు లేకుంటే నేనింకా ఆటగాళ్లలో కాన్ఫిడెన్స్‌‌‌‌ ఎలా పెంచగలను?  మ్యాచ్‌‌‌‌లో ఓడినా సరే, ఫైనల్‌‌‌‌కు వచ్చిన మూమెంట్‌‌‌‌ను సెలెబ్రేట్‌‌‌‌ చేసుకోవాలని నాకు నేను చెప్పుకున్నా. కానీ, మేం ఫైనల్లో గెలిచి వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ సాధిస్తామని అక్కడి అధికారులు అనుకోలేదు. అందుకే షాంపేన్‌‌‌‌ బాటిల్స్‌‌‌‌ అన్నీ వెస్టిండీస్‌‌‌‌ డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌లోని రెఫ్రిజిరేటర్‌‌‌‌లో ఉంచారు. మ్యాచ్‌‌‌‌ నెగ్గిన తర్వాత నేను నేరుగా క్లైవ్‌‌‌‌ లాయిడ్‌‌‌‌ దగ్గరకు వెళ్లా. మీకు ఈ షాంపేన్‌‌‌‌ బాటిల్స్‌‌‌‌తో  పని లేదు నేను తీసుకెళ్తా అని చెప్పా.

లాయిడ్‌‌‌‌ తలూపడంతో వెస్టిండీస్‌‌‌‌ డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌ నుంచి బాటిల్స్‌‌‌‌ తీసుకొచ్చా.  వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ నెగ్గడం.. షాంపేన్‌‌‌‌ పొంగిస్తూ ఆ ఆనందాన్ని సెలెబ్రేట్‌‌‌‌ చేసుకోవడం నా లైఫ్‌‌‌‌లో గ్రేటెస్ట్‌‌‌‌ మూమెంట్‌‌‌‌. మా టీమ్‌‌‌‌లో ఉన్న మిగతా 13 మందిలో కూడా ఇప్పటికీ అదే ఎమోషన్‌‌‌‌ ఉంటుందని కచ్చితంగా చెప్పగలన’ని కపిల్‌‌‌‌ పేర్కొన్నాడు. ఈ నెల 30న మొదలయ్యే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌‌‌‌ విజేతగా  నిలిచే అవకాశం ఉందని దేవ్‌‌‌‌ అభిప్రాయపడ్డాడు. ఇండియా, ఆస్ట్రేలియా కూడా సెమీస్‌‌‌‌కు రావొచ్చని, ఆ తర్వాత  విధి, కొంత అదృష్టం భవితవ్యాన్ని తేలుస్తాయని చెప్పాడు. సమతూకంలో  ఉన్న టీమిండియా  టోర్నీలో బాగా రాణించగలదన్నాడు.