హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చిల్లరగా వ్యవహరించాడని, అలాంటి వ్యక్తిని కేటీఆర్, హరీశ్ రావు ఎలా సమర్థిస్తారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ప్రశ్నించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ నేతలకు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బాల్క సుమన్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి బీఆర్ఎస్ నేతలు దౌర్జన్యాలకు దిగారని, పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్నారు.
పైగా వారే దొంగ ఏడుపులు ఏడ్చి, ప్రజల మద్దతు పొందాలని చూశారని ఆరోపించారు. ఇలాంటి ముసలి కన్నీరు కార్చే నేతలను తెలంగాణ సమాజం విశ్వసించదని, రానున్న గ్రేటర్ ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఫలితాలే పునరావృతం అవుతాయని స్పష్టం చేశారు. ఇటు పంచాయతీ, అటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు అద్దం పట్టిందన్నారు.
పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టే దమ్ము, ధైర్యం రేవంత్ సర్కార్‌కు లేదని కామెంట్లు చేసిన కేటీఆర్, హరీశ్ రావు.. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ఏం మాట్లాడ్తరని ప్రశ్నించారు. రేవంత్ ప్రజా పాలనకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఫిదా అయిందని, దీంతో సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్, ఖర్గే అభినందించారని గుర్తుచేశారు.
