వీడియోకాన్ లోన్ స్కామ్.. దోషిగా తేలిన ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్!

వీడియోకాన్ లోన్ స్కామ్.. దోషిగా తేలిన ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్!

వీడియోకాన్ సంస్థకు రూ.300 కోట్ల రుణ మంజూరు వ్యవహారంలో అప్పటి ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చర్ రూ.64 కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. కేసులో ఈడీ సమర్పించిన సక్ష్యాలను ధ-ృవీకరించిన ట్రిబ్యునల్ ఈ మేరకు తన తీర్పును వెలువరించింది. దీంతో కొచ్చర్ ఫ్యామిలీకి చెందిన ముంబై ఫ్లాట్, డబ్బు, పెట్టుబడులను ఈడీ సీజ్ చేయటాన్ని సమర్థించింది. రుణ మంజూరులో దురుద్దేశం దాగి ఉన్నట్లు ట్రిబ్యూనల్ గుర్తించింది. 

కేసులో వీడియోకాన్ గ్రూప్ కంపెనీలు ఎస్ఈపీఎల్, న్యుపవర్ రెన్యువబుల్స్ లంచం డబ్బును మార్పుకు కేంద్రంగా పనిచేయాని కోర్టు గ్రహించింది. పైగా న్యుపవర్ సంస్థ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ నియంత్రణలో ఉన్న సంగతి తెలిసిందే. రూ.300 కోట్ల రుణాన్ని మంజూరు చేసిన తర్వాతి రోజునే రూ.64 కోట్ల లంచం చెల్లింపు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. కేవలం కాగితాలపైన మాత్రమే న్యుపవర్ సంస్థకు యజమానిగా వీడియోకానన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ చూపబడినట్లు ఈడీ గుర్తించింది.

న్యుపవర్ సంస్థ ఎండీగా ఉన్న చందా కొచ్చర్ భర్త చేతిలోనే సంస్థ నడిచినట్లు ఈడీ నొక్కి చెప్పింది. రుణ మంజూరు కమిటీలో ఉన్న చందా కొచ్చర్ రూ.300 కోట్లు ఇవ్వటానికి మునుపు తన భర్త దీపక్ కంపెనీకి వీడియోకాన్ సంస్థతో వ్యాపారం సంబంధాల గురించి వెల్లడించలేదు. ఈ విషయాన్ని కావాలనే దాచిపెట్టినట్లు గుర్తించారు. అయితే రుణ కుంభకోణానికి సంబంధించిన విషయాలు బయటకు రావటంతో తన గడువుకు ముందు చందా కొచ్చర్ ఐసీఐసీఐ సీఈవో అండ్ ఎండీ పదవికి అక్టోబర్ 2018లో రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తన 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని సంస్థలో ముగించారు. కానీ చందా కొచ్చర్ తనపై వచ్చిన ఆరోపణలను అప్పట్లో ఖండించారు.