చీతాలపై ప్రచార కార్యక్రమానికి ఏ పేరు పెట్టాలి?

చీతాలపై ప్రచార కార్యక్రమానికి ఏ పేరు పెట్టాలి?

చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరును పెట్టనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఇవాళ జరిగిన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.  దీన్ దయాళ్ ఉపాధ్యాయ గొప్ప మానవతావాది, ఆలోచనాపరుడని ప్రశంసించారు. భారత్ లో అంతరించిపోయిన చీతాలను నమీబియా నుంచి తిరిగి తీసుకురావడంపై 130 కోట్ల దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. చీతాలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఇందుకోసం ఓ కాంటెస్ట్ పెడుతున్నామని, గెలిచిన వారికి అందరి కంటే ముందుగా చీతాలను చూసే అవకాశం వస్తుందని చెప్పారు. చీతాలపై భారత్ ప్రభుత్వం చేస్తున్న ప్రచార కార్యక్రమానికి ఏ పేరు పెట్టాలి? అలాగే నమీబియా నుంచి వచ్చిన చీతాలకు ఎలాంటి పేర్లు పెట్టాలో MyGov వెబ్ సైట్  ద్వారా సూచించాలని కోరారు.  

సెప్టెంబర్ 28న భగత్ సింగ్ జయంతి సందర్భంగా.. చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. అమరవీరుల స్మారక చిహ్నాలు, వారి పేరు మీద ఉన్న స్థలాలు, సంస్థల పేర్లు మనకు స్పూర్తిగా నిలుస్తాయని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. దీంతో పాటు 'యూత్ ఫర్ పరివర్తన్‌’ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. బెంగళూరులో ‘యూత్ ఫర్ పరివర్తన్’ పేరుతో ఓ టీమ్ ఉందని... గత 8 సంవత్సరాలుగా ఈ బృందం పరిశుభ్రత, ఇతర సామాజిక కార్యకలాపాల కోసం పని చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు నగరవ్యాప్తంగా 370కి పైగా ప్రదేశాలను సుందరీకరించిందని చెప్పారు. చెత్తను తొలగించడమే కాకుండా గోడలపై పెయింటింగ్స్‌ కూడా వాళ్లు వేస్తున్నారని ప్రశంసించారు.