ప్రశ్నిస్తా... ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు .. ములాఖత్ లో మిలాఖత్ చేసుకున్నాడు: సీఎం జగన్

ప్రశ్నిస్తా... ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు .. ములాఖత్ లో మిలాఖత్ చేసుకున్నాడు: సీఎం జగన్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  45 ఏళ్లుగా దోపిడీని రాజకీయంగా మార్చుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  నిడదవోలులో విమర్శించారు. ఇటీవలే అవినీతి కేసులో సాక్షాలు, ఆధారాలతో చంద్రబాబు అరెస్ట్‌ అయ్యారని చెప్పారు.   చంద్రబాబు అడ్డంగా దొరికినా.. ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా.. అన్న దత్తపుత్రుడు నేరుగా జైలుకు వెళ్లి ములఖాత్‌లో మిలాఖత్ చేసుకున్నాడు అని సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికినా.. చంద్రబాబు ఎన్ని దొంగతనాలు చేసిన, దోపిడీ చేసిన, వెన్నుపోటులు పొడిచిన.. ఆయనను రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన దొంగల ముఠా సభ్యులు ఉన్నారని అన్నారు. అయితే చట్టం ఎవరికైనా ఒక్కటేనని చెప్పేవారు ఇంతకాలం లేరని చెప్పారు. మాములు వ్యక్తి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో.. అధికారంలో ఉన్న వ్యక్తి కూడా తప్పు చేస్తే అలాంటి శిక్ష పడుతుందని.. చట్టం ఎవరికైనా ఒక్కటేనని  చెప్పారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు అడ్డంగా దొంగగా దొరికిన.. ఆయన చేసినది నేరమే కాదని వాదించడానికి అందులో వాటా దారులు వెంటనే రెడీ అయ్యారని విమర్శించారు. లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ ‌సృష్టించి.. చంద్రబాబే ప్రభుత్వ నిబంధనలు పక్కకు పెట్టించాడు. సీమెన్స్ కంపెనీనే రూ. 371 కోట్లు తమకు ముట్టలేదని.. ఆ అగ్రిమెంట్‌తో తమకు సంబంధం లేదని చెప్పినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని ఈడీ కూడా ఫేక్ అగ్రిమెంట్ చేసిన దొంగలను అరెస్ట్ చేసినప్పటికీ.. ఆ స్కామ్‌ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని సాక్షాలు ఉన్నాయి. అధికారులు డబ్బులు ఇవ్వద్దని చెప్పిన వాటన్నింటికి పక్కకు పెట్టి చంద్రబాబు 13 సందర్భాల్లో ఒత్తిడి తీసుకొచ్చి స్పష్టంగా సంతకాలు చేశాడు. సీఐడీ వాళ్లు ఇవన్నీ చూపిస్తున్నారు. ఆ డబ్బులు డొల్ల సూట్‌కేసు కంపెనీలకు ఎలా మళ్లించాయో ఈడీ కనుక్కొని అరెస్ట్‌లు చేసింది.