భువనేశ్వరి ములాఖత్ నిరాకరణకు కారణం ఇదే..

భువనేశ్వరి ములాఖత్ నిరాకరణకు కారణం ఇదే..

 ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఏపీ  మాజీ సీఎం చంద్రబాబు (Chandrababau)ను కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరికి అనుమతి లభించలేదు. తన భర్త చంద్రబాబును ఇటీవల కలిసిన భువనేశ్వరి మరోసారి ములాఖత్ అయ్యేందుకు దరఖాస్తు చేసుకోగా, జైలు అధికారులు తిరస్కరించారు. వారానికి మూడు సార్లు ములాఖత్‍కు అవకాశం ఉన్నప్పటికీ అధికారులు తిరస్కరించారని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రాజమండ్రి జైలులో ములాఖత్ పై జైళ్ల శాఖ స్పష్టత ఇచ్చింది.

నారా భువనేశ్వరి ఆర్పీ నెంబర్ 7691 చంద్రబాబుతో గురువారం (సెప్టెంబర్ 14)  మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి జైలులో ములాఖత్ అయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అయితే వారానికి రెండు ములాఖత్ లు మాత్రమే ఉంటాయని, ఆ నిబంధన కారణంగానే భువనేశ్వరిని చంద్రబాబును కలిసేందుకు ఈ వారం మరోసారి అనుమతి లభించలేదు.   సాధారణంగా రిమాండ్ లో  ఉన్న ముద్దాయికి  ఒక వారంలో రెండు ములాఖత్ లకు మాత్రమే అవకాశం ఉంటుంది. అందులోనూ ఒక ములాఖత్ లో ముగ్గురు సందర్శకులకు మాత్రమే అనుమతి ఇస్తారు. 

రిమాండ్ ముద్దాయి చంద్రబాబు సెప్టెంబర్ 11న రాజమండ్రి జైలుకు వచ్చారు. ఆయన ఈ వారం రెండు ములాఖత్ లు ఇప్పటికే వినియోగించుకున్నారు. సెప్టెంబర్ 12న ఆయన  భార్య నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు.  అనంతరం సెప్టెంబర్ 14న జరిగిన రెండో ములాఖత్ లో భాగంగా ఆయన తనయుడు నారా లోకేష్, వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు చంద్రబాబును కలిసి పరామర్శించారు. దాంతో జైలులో ఓ ముద్దాయిని కలిసేందుకు వారంలో ఉన్న రెండు ములాఖత్ లు పూర్తయ్యాయి. 

Also Read :- స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే : వైఎస్ జగన్

కానీ, అత్యవసర కారణాలతో ఎవరైనా సందర్శకులు రిమాండ్ ముద్దాయిని కలిసి మాట్లాడటానికి లిఖిత పూర్వకంగా అభ్యర్థించాల్సినట్లయితే.. అందుకు గల అత్యవసర కారణాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఆ కారణం వాస్తవమని నిర్ధారణ అయితే జైలు పర్యవేక్షణాధికారి విచాక్షణాధికారాలు ఉపయోగించి 3వ ములాఖత్ కు అనుమతి ఇస్తారు. అయితే ప్రస్తుతం భువనేశ్వరి ఎలాంటి అత్యవసర కారణాలను తన దరఖాస్తులో ప్రస్తావించలేదు. ఆ కారణంగా నిబంధనల ప్రకారం మూడో ములాఖత్ లో నారా భువనేశ్వరికి రాజమండ్రి జైలు అధికారులు అనుమతి చేయలేకపోయారని కోస్తాంధ్ర ప్రాంతం, రాజమహేంద్రవరం జైళ్ల ఉప శాఖాధికారి  స్పష్టం చేశారు.