అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చింది. తన అగ్రనేతను కోల్పోయిన ఇరాన్.. ఆత్మరక్షణలో పడకుండా తలొగ్గేదే లేదు అన్నట్లుగా అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. తాజా దాడుల్లో ఇరాన్ వ్యూహాత్మకంగా అమెరికా కమ్యూనికేషన్ వ్యవస్థలు, రాడార్ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని కోలుకోలేని దెబ్బ తీసినట్లు అంతర్జాతీయ మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి.
తాజా అటాక్ లో ఇరాన్.. బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలోని 7 అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసిందని వెల్లడైంది. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన అత్యాధునిక క్షిపణి డిటెక్షన్ రాడార్లు, శాటిలైట్ డిష్‌లు, రాడోమ్స్ ధ్వంసమయ్యాయి. దీనివల్ల మధ్యప్రాచ్యంలో అమెరికా దళాల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ అటాక్ చేసిన అమెరికా స్థావరాలు ఇవే..
ఎర్బిల్ ఎయిర్ బేస్ (ఇరాక్): కుర్దిస్తాన్ ప్రాంతంలో ఉన్న కీలక వ్యూహాత్మక స్థావరం.
ఐన్ అల్-అసద్ ఎయిర్ బేస్ (ఇరాక్): పశ్చిమ ఇరాక్‌లోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరాల్లో ఒకటి.
అక్రోటిని (సైప్రస్): మధ్యధరా సముద్రంలో ఉన్న బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ బేస్.
మువాఫక్ అల్-సల్తీ ఎయిర్ బేస్ (జోర్డాన్): ఇక్కడి నుండే అమెరికా వైమానిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి.
అలీ అల్-సలేం ఎయిర్ బేస్ (కువైట్): లాజిస్టిక్స్ అండ్ వైమానిక రవాణాకు ప్రధాన కేంద్రం.
క్యాంప్ బ్యూరింగ్ (కువైట్): వేల సంఖ్యలో అమెరికా దళాలు ఇక్కడ విడిది చేస్తాయి.
NSA బహ్రెయిన్ (బహ్రెయిన్): అమెరికా నౌకాదళం 'ఫిఫ్త్ ఫ్లీట్' (5th Fleet) ప్రధాన కార్యాలయం.
అల్ ఉదీద్ ఎయిర్ బేస్ (ఖతార్): మధ్యప్రాచ్యంలోనే అతిపెద్ద అమెరికా ఎయిర్ బేస్.
ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ (సౌదీ అరేబియా): క్షిపణి రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమానాలకు నిలయం.
జెబెల్ అలీ పోర్ట్ (UAE): అమెరికా నౌకాదళ నౌకలు విదేశాల్లో ఎక్కువగా సందర్శించే నౌకాశ్రయం.
అల్ ధఫ్రా ఎయిర్ బేస్ (UAE): ఇక్కడి నుండే నిఘా.. డ్రోన్ కార్యకలాపాలు సాగుతాయి.
Mapped: U.S. Military Bases in the Middle East, and Which Ones Iran Hit 💥https://t.co/XSkXIrUa1q pic.twitter.com/sjqgrb2Cbt
— Visual Capitalist (@VisualCap) March 4, 2026
కీలక స్థావరాలపై ఇరాన్ పంజా:
ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించిన వివరాల ప్రకారం.. యూఏఈలోని అల్ రువైస్ బేస్‌లో ఉన్న అమెరికాకు చెందిన THAAD మిస్సైల్ డిఫెన్స్ బ్యాటరీని ఇరాన్ నిర్వీర్యం చేసింది. ఇది అమెరికా గగనతల రక్షణ కవచంలో ఉన్న అతిపెద్దదిగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఖతార్‌లోని అతిపెద్ద ఎయిర్ బేస్ అయిన అల్ ఉదీద్‌పై జరిగిన దాడిలో శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కకావికలమయ్యాయి.
బహ్రెయిన్.. సౌదీలో విధ్వంసం:
బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళం ఫిఫ్త్ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్‌పై ఇరాన్ వన్-వే అటాక్ డ్రోన్లతో విరుచుకుపడింది. అక్కడ అత్యంత కీలకమైన శాటిలైట్ టెర్మినల్స్ ధ్వంసమయ్యాయి. ఇక సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ కూడా ఇరాన్ క్షిపణి దాడుల వల్ల భారీగా దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాలు నిరూపిస్తున్నాయి.
ఈ దాడుల ద్వారా ఇరాన్ ఒక స్పష్టమైన సందేశాన్ని పంపిస్తోంది. తమ దేశంపై జరిగే దాడులకు ప్రతిస్పందనగా అమెరికా సాంకేతిక వ్యవస్థలను నిర్వీర్యం చేయగల సామర్థ్యం తమకుందని తాజా దాడులతో నిరూపించుకుంటోంది. పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యానికి ఇరాన్ గట్టి సవాలు విసురుతుండటంతో.. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.
