130 సీట్లు పక్కా గెలుస్తాం: చంద్రబాబు

130 సీట్లు పక్కా గెలుస్తాం: చంద్రబాబు

ఏపీలో జరిగిన  అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో నూటికి నూరు శాతం తమదే విజయమని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత అర్ధరాత్రి టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని, ఇందులో రెండో ఆలోచనలేదని స్పష్టం చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు ఈ సందర్భంగా చంద్రబాబు అభినందనలు తెలిపారు. కౌంటింగ్‌ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలన్నారు.

ఈవీఎంల మొరాయింపుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఎన్నికలు ప్రారంభమైన సమయంలో రాష్ట్రం మొత్తమ్మీద 31 శాతం ఈవీఎంలు పని చేయలేదని అన్నారు. ఒకే రోజు ఈవీఎంలు పలుసార్లు మొరాయించడంతో ప్రజలు పలుసార్లు కేంద్రాలకు తిరిగారని చెప్పారు.

పోలింగ్ నిక్షిప్తమైన ఈవిఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు చంద్రబాబు. స్ట్రాంగ్‌ రూంల దగ్గర.. 40 రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలన్నారు. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓడిపోతున్నామనే భయంతోనే వైసీపీ పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు టీడీపీ పక్షానే నిలిచారని బాబు ఆనందం వ్యక్తం చేశారు.