మే 23న చంద్రబాబు మాజీ కావటం ఖాయం: అంబటి

మే 23న చంద్రబాబు మాజీ కావటం ఖాయం: అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే గత కొన్ని రోజులుగా విచిత్రంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి  అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఎన్నికల అధికారులను చంద్రబాబు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని,సాక్షాత్తు ఈసి అధికారినే చంద్రబాబు బెదిరిస్తున్నారన్నారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కొనేశారని చంద్రబాబు మతి లేకుండా మాట్లాడుతున్నారని, ఈవీఎంలు సరిగా పనిచేయలేదని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అంబటి మండి పడ్డారు. ఈవీఎంలు పని చేయకపోతే పోలింగ్‌ శాతం ఎలా పెరిగిందని ప్రశ్నించారు

పదే పదే ఈవిఎంల పనితీరుపై ఆరోపణలు చేస్తున్న ఆయన.. 2014 ఎన్నికలలో ఇదే ఈవిఎంల వల్ల గెలిచిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.  చాలాచోట్ల తమ పార్టీ నేతలపైనే టీడీపీ నేతలు దాడులు చేసి తిరిగి తమపైనే నెడుతున్నారని అన్నారు. కోడెల శివప్రసాదరావుపై దాడి చేసింది తమ పార్టీకి చెందిన వారు కాదని, అసలు కోడెల ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్‌ స్టేషన్‌ లోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. బూత్‌లోకి వెళ్లి దౌర్జన్యం చేశారు కాబట్టే అక్కడి ప్రజలు తిరగబడ్డారని అంబటి అన్నారు.

మే 23 న అందరి జాతకాలు బయటపడతాయని.,ఆ రోజు నుంచి చంద్రబాబు మాజీ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆ రోజున వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.