ఎన్నికల కమిషన్ కు చంద్రబాబు లేఖ

ఎన్నికల కమిషన్ కు చంద్రబాబు లేఖ

రాష్ట్రంలో ఎన్నికల వేళ జరిగిన పలు హింసాత్మక ఘటనలపై మరియు ఈవిఎంల వైఫల్యంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమీషన్ కు లేఖలు రాశారు.  ఈసీతో పాటు రాష్ట్ర డీజీపికి కూడా లేఖలు రాసిన ఆయన.. రాష్ట్రం మొత్తమ్మీద దాదాపు 30 శాతం ఈవిఎం లు పనిచేయకపోవడాన్ని లేఖల్లో ప్రస్తావించారు.

ఈవిఎంలు పని చేయకపోవడం వల్ల మూడు గంటల సమయం వృథా అయిందని, అనంతపురం జరిగిన హింసాత్మక ఘటనకు కూడా ఈవిఎం ఓ కారణమని ఈసీ గోపాలకృష్ణ ద్వివేదికి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.  ఈవిఎంలు మొరాయించిన ప్రతి నియోజకవర్గంలో రీ పోలింగ్ జరిపాలని అన్నారు.

రాష్ట్ర డీజీపికి రాసిన లేఖలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలింగ్ విధానాన్ని అడ్డుకున్నారని, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో హింసకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో వైసీపీ నాయకులు మితిమీరి EVM లను డామేజ్  చేశారని, రిగ్గింగ్ కు  అనుమతించలేదన్న కారణంతో  పోలింగ్ సిబ్బందిని బెదిరించారని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులకు సంబంధించి లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన అవసరముందని సీఎం చెప్పారు.  ఇటువంటి ఘటనలకు కారణమైన వ్యక్తులను శిక్షించేలా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై అన్ని జిల్లా సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా DGPని  కోరారు. వీటితో పాటుగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ  హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయో ఆ ప్రాంతాల జాబితాను డీజీపీకి  చంద్రబాబు నాయుడు సమర్పించారు.