
వారమంతా ఆట. వీకెండ్‌లో వేట. ఇదే బిగ్‌బాస్ గేమ్. ఈ వీకెండ్‌లో కూడా రెండు ఎపిసోడ్స్ ను స్పెషల్‌గా ప్లాన్ చేశారు. మొదటి రోజు ఆటగాళ్లందరి తప్పొప్పుల గురించి పంచాయతీ జరిగింది. రెండో రోజు ఆటపాటల నడుమ ఎలిమినేషన్ కూడా ముగిసింది. ఇంతకీ ఈ వారం బిగ్‌బాస్ హౌస్ గేటు ఎవరి కోసం తెరుచుకుంది?
దేవిశ్రీ పాట.. అదిరింది ఆట
ఇవాళ ఎపిసోడ్ మొదలవుతూనే దేవిశ్రీ ప్రసాద్ ఎంటరయ్యాడు. అతను చేసిన కొత్త ప్రైవేట్ సాంగ్ ప్రమోషన్ కోసం బిగ్‌బాస్ స్టేజ్ మీదికి వచ్చి నిలబడ్డాడు. తనని సాదరంగా ఆహ్వానించిన నాగ్ ముందుగా అతను చేసిన ‘ఓ పిల్లా’ అనే పాటను ఆడియెన్స్ కు చూపించారు. దాని గురించి కాసేపు ముచ్చటించిన తర్వాత హౌస్‌మేట్స్ ముందుకి దేవిని తీసుకెళ్లారు. అర్జున్, శ్రీసత్యల విషయంలో సెటైర్లు వేసి నవ్వించారు. దేవిశ్రీ కంపోజ్ చేసిన పాటలతో ఓ గేమ్ కూడా ఆడించారు. ప్లేయర్స్ అందరినీ రెండు టీములుగా విభజించారు. కొన్ని చీటీల్లో దేవి పాటల పల్లవులు రాశారు. ఒక్కో టీమ్ నుంచీ ఒక్కొక్కరు వచ్చి తాము తీసిన చీటీలో ఉన్న పాటని తమ టీమ్‌కి అర్థమయ్యేలాగా బొమ్మ గీసి చూపించాలి. ఇదే గేమ్. రెండు టీముల వాళ్లూ హుషారుగా పాల్గొన్నారు. ఒక టీమ్ బాగా గెస్ చేసి గెలిచింది. మరో టీమ్ వెనుకబడి ఓడింది. మొత్తానికి ఈ ఆట సరదా సరదాగా గడిచిపోయింది. అందరికీ బై చెప్పి దేవిశ్రీ వెళ్లిపోయాడు.
ఏ సామెత ఎవరిదంటే..
తర్వాత కాసేపు సామెతలతో అందరి మనసుల్లోని మాటల్నీ బయట పెట్టించే ప్రయత్నం చేశారు నాగ్. అక్కడ కొన్ని సామెతలు పెట్టారు. ఒక్కొక్కరూ ఒక్కోటి సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎవరికి సూటవుతుందో వారి మెడలో వేయాలి. ఏమిరా ఎగిరి పడ్డావ్ అంటే అదొక పల్టీలే అనే సామెతని రాజ్‌కి తగిలించింది ఫైమా. ఏదో ఒకటి చేసేసి అది తన స్ట్రాటజీ అని చెప్పే లక్షణం తనకి ఉందని అంది. ఆకులా వచ్చి మేకయ్యాడంటూ శ్రీహాన్‌కి గీతూ కాంప్లిమెంట్ ఇచ్చింది. గీతూ అగ్గికి ఆజ్యం పోస్తుందని ఇనయా అంటే, ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి సామెతని కూడా గీతూకే తగిలించింది మెరీనా. ఇలా ప్రతి ఒక్కరూ ఇతర కంటెస్టెంట్లపై తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. అయితే ప్రతి దానిలోనూ ఏదో పాజిటివ్ విషయం వెతికి మరీ మంచితనాన్ని ప్రదర్శించే బాలాదిత్య ఈసారి కూడా తమాషా చేశాడు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే సామెత రోహిత్‌కి సెట్టవుతుందన్నాడు. అతను అన్నీ ఉన్న ఆకు కనుక ఎగిరిపడటం లేదన్నాడు. ఇక ఆదిరెడ్డి కూడా ఇదే తరహాలో చేశాడు. పచ్చ కామెర్లు వచ్చినవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అనే సామెత బాలాదిత్యకి సరిపోతుందన్నాడు. అతను మంచోడు కనుక అందరినీ మంచోళ్లనే అనుకుంటాడని చెప్పాడు. ఈ రెండు సామెతలూ సాధారణంగా నెగిటివ్ సెన్స్ తోనే వాడతారు తప్ప పాజిటివ్‌గా చెప్పరు. మరి వీళ్లిద్దరూ ఇలా చెప్పడం చూస్తుంటే సేఫ్ ఆడారా లేక అసలు వీళ్లకి కాన్సెప్ట్ అర్థం కాలేదా తెలియడం లేదు.
చంటి ఎలిమినేషన్.. ఇల్లంతా ఎమోషన్
ఆటలాడుతూనే ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగ్. చివరికి ఇనయా, చంటి మిగిలిపోయారు. బ్రేక్ తర్వాత ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ చెప్పడంతో ఇంట్లో చిన్నపాటి హంగామా మొదలైంది. సూర్య భోరుభోరున ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇద్దరూ నాకు కావలసినవాళ్లే, ఎవరు వెళ్లినా బాధే అంటూ గుక్కపెట్టాడు. నేను ఎవరికి దగ్గరైతే వాళ్లు నాకు దూరమైపోతారు అంటూ సెంటిమెంటల్ డైలాగ్స్ కూడా కొట్టాడు. ఓ మూలకు వెళ్లి అతను కుమిలిపోతుంటే ఇనయా వెళ్లి ఓదార్చడం స్టార్ట్ చేసింది. అతన్ని హగ్ చేసుకుని, కన్నీళ్లు తుడిచి మరీ కూల్ చేయడానికి ట్రై చేసింది. మరోవైపు ఫైమా కూడా ఏడుపు అందుకుంది. మీరిద్దరూ కావలసినవారే అంటూ చంటి దగ్గర బాధపడింది. ఇదొక ఆట, తప్పదు అంటూ చంటి ధైర్యం చెప్పాడు. ఆమె వినకపోవడంతో కాస్త గట్టిగా కూడా చెప్పాడు. బ్రేక్ ముగిశాక చంటి ఎలిమినేట్ అవ్వడంతో ఇనయా గుక్కపెట్టింది. చంటిని వాటేసుకుని నువ్వొద్దు, నేనే వెళ్లిపోతా అంటూ ఒకటే ఏడ్చింది. ఎంతకీ వదలలేదు. చంటి ఎలాగో తప్పించుకుని తట్టా బుట్టా సర్దుకున్నాడు. అందరికీ బై చెప్పి బయల్దేరాడు. అతను గేటు దాటే వరకు కూడా సూర్య, ఇనయా, ఫైమా శోకాలు పెడుతూనే ఉన్నారు. కొద్ది రోజులు తమతో ఉన్న వ్యక్తి వెళ్తుంటే కాస్త బాధనిపిస్తుంది కానీ మరీ ఈ రేంజ్‌లో ఏడవడం చూస్తుంటే ఇదేమైనా స్క్రిప్టెనా అనే అనుమానం రాకపోలేదు.
స్పెషల్ క్లాస్.. ఎవరు పాస్?
స్టేజ్ మీదికి వచ్చిన చంటికి చిన్న పని అప్పగించారు నాగ్. ఓ ఐదుగురికి ముప్ఫై అయిదు కంటే తక్కువ మార్కులు వేయమన్నారు. తప్పదు కాబట్టి ఓ అయిదుగురికి ముప్ఫై నాలుగున్నర మార్కులు వేసి కానిచ్చేశాడు చంటి. ఆ తర్వాత డెబ్భై అయిదు కంటే ఎక్కువ మార్కులు ఓ అయిదుగురికి వేయమంటే వేసి కారణాలు కూడా చెప్పాడు. మెరీనాని మదరిండియా అన్నాడు. ఫైమా అందరినీ నవ్విస్తుందని, సూర్య చాలా మంచోడని, రేవత్ గారాబంగా పెరగడం వల్ల అలా ఉంటాడే తప్ప మంచి మనసున్నవాడని చెప్పాడు. ఇక శ్రీహాన్‌కైతే ఆట మీద ఫుల్ క్లారిటీ ఉందన్నాడు. ఆ తర్వాత మిగతావాళ్లకి కూడా మార్కులు వేసేయమని నాగ్ చెప్పడంతో అందరికీ మార్క్స్ ఇచ్చాడు చంటి. ఇనయాకి వందకి వంద వేసేశాడు. తను చాలా ఇంప్రూవ్ అయ్యిందని చెప్పాడు. ఆదికి, గీతూకి ఆట మీద ఫుల్ పట్టు ఉందన్నాడు. బాలాదిత్య చాలా మెచ్యూరిటీతో తెలివితో ఆడుతున్నాడని చెప్పాడు. అయితే ఎక్కడో అతి మంచితనం అనే ముసుగు ఉందని, దాన్ని తీసేయాలని అన్నాడు. ఎప్పుడేది అనిపించినా నేరుగా వెళ్లి తెలుసుకోవాలే తప్ప ఎవరో చెప్పింది వినొద్దని కీర్తికి సలహా ఇచ్చాడు. బ్యాలెన్స్డ్ గా ఆడమని రేవంత్‌కి కూడా చెప్పాడు. ముందు ఎందుకలా చేస్తున్నావో వివరంగా చెప్పాకే ఏదైనా చేయమని గీతూతో అన్నాడు. ఆపైన సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.
ఇక తర్వాతి ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. అంటే హౌస్‌లో చిన్నపాటి యుద్ధమే మొదలౌతుంది. ఆల్రెడీ రేవంత్‌కి, బాలాదిత్యకి ఆర్గ్యుమెంట్ జరిగినట్టు ప్రోమోలో చూపించారు. రేవంత్ తనని నామినేట్ చేసిన రీజన్‌కి సుదీప కూడా సీరియస్ అయినట్టు కనిపించింది. మరి మిగతావాళ్లు ఎవరిని నామినేట్ చేస్తారో, దానికి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.