చిన్న చిన్న షాపుల వరకే ఆఫీసర్ల తనిఖీలు

చిన్న చిన్న షాపుల వరకే ఆఫీసర్ల తనిఖీలు
  • గోదాంల వైపు కన్నెత్తి చూస్తలేరు
  • చిరు వ్యాపారులకే ఫైన్లు
  • వసూళ్లలో సిబ్బంది చేతివాటం

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్లాస్టిన్ నిషేధం మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. ఏడాదికోసారి ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్లాస్టిక్​ను తరిమేస్తామని చెబుతున్న ఆఫీసర్లు.. వారం రోజుల తర్వాత మెత్తబడిపోతున్నారు. దీంతో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం గుట్టుగా సాగుతోంది. మరోవైపు కవర్లు, గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తున్నారన్న కారణంతో వీధి వ్యాపారులు, చిన్నచిన్న దుకాణాలకు రూ.వేలల్లో ఫైన్లు వేస్తున్న సిబ్బంది.. బడా వ్యాపారుల హోల్ సేల్​ దుకాణాలు, గోదాంల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు గ్రేటర్​ సిటీ నుంచే ప్లాస్టిక్​ సరఫరా అవుతున్నా పట్టించుకునేవాళ్లే కరువయ్యారు.

గుట్టుగా దందా..

బల్దియా పరిధిలో దాదాపు 24వేల దుకాణాలు ఉండగా.. అందులో చిన్నచిన్న కిరాణ షాపులే సగం ఉన్నాయి. చాలాచోట్ల నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. ఆఫీసర్లు తనిఖీల పేరుతో ఫైన్లు వేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తి అయ్యే స్థలాలను మాత్రం వదిలేస్తున్నారు. దీంతో సిటీలో నిత్యం 25 మెట్రిక్​ టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. వరంగల్ సిటీలోని పిన్నవారి స్ట్రీట్, బీట్ బజార్, హనుమకొండ లోని టైలర్​ స్ట్రీట్ లో చాలామంది గుట్టుగా గోదాములు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ దందా సాగిస్తున్నారు.  హైదరాబాద్​ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్లాస్టిక్​ కవర్లు తెప్పించి రాత్రికి రాత్రే ఆయా గోదాముల్లో స్టోర్​చేస్తున్నారు. అనంతరం తమతమ ఏజెంట్ల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హోల్​ సేల్​, రిటేల్​ షాపులకు సప్లై చేస్తున్నారు. ఈ విషయం ఆఫీసర్ల దృష్టిలో ఉన్నా ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు.

రశీదులు ఇవ్వకుండానే పెనాల్టీలు..

2016 నుంచి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న కవర్లను కేంద్రం బ్యాన్ చేసింది. ఇప్పుడు 120 మైక్రాన్ల కవర్లను వాడొద్దని నియమాలను సవరించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్​ ఆఫీసర్లు జులై 1 నుంచి నగర పరిధిలో స్పెషల్ డ్రైవ్​లు చేపట్టారు. ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహించి వీధి వ్యాపారులు, చిన్నచిన్న దుకాణాలకు రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు ఫైన్లు విధించారు. ఇలా నెల మొత్తం మీద దాదాపు రూ.2.5 లక్షల వరకు ఫైన్లు వసూలు చేశారు. వీళ్లంతా చిన్నచిన్న దుకాణాలవారే కాగా.. నగరంలో ప్లాస్టిక్​ దందా చేస్తున్న బడా బాబుల జోలికి వెళ్లలేదు. కాగా, కొంతమంది సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. షాపు యజమానులకు రూ.500 నుంచి రూ.5 వేల వరకు ఫైన్ పేరున వసూలు చేస్తూ.. రశీదులు మాత్రం ఇవ్వకుండానే వెళ్తున్నారని బాధితులు వాపోతున్నారు. కొందరు వ్యాపారులు పేపర్ ప్రొడక్ట్స్ తెప్పించి బిజినెస్​నడిపిస్తున్నా.. శానిటరీ ఇన్​ స్పెక్టర్లు, జవాన్లు పెనాల్టీల పేరున వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయంపై కంప్లైంట్ చేసే అవకాశం ఉన్నా తమను టార్గెట్​ చేసి బిజినెస్​రన్ అవ్వకుండా చేస్తారనే ఉద్దేశంతో ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనుకడుగు వేస్తున్నారు.

బాధ్యులపై యాక్షన్​ తీసుకుంటం

సింగిల్​ యూజ్ ప్లాస్టిక్​ కంట్రోల్​ చేసేందుకు ఇంకా స్పెషల్ డ్రైవ్​లు కొనసాగిస్తున్నాం. ఫైన్లు కూడా విధిస్తున్నాం. గోదాములను ఐడెంటీఫై చేసి వాటిలోనూ తనిఖీలు చేపడుతాం. సిబ్బంది రశీదులు లేకుండా వసూళ్లకు పాల్పడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై మరోసారి సూచనలు​ ఇచ్చి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం.

- డా.వి.జ్ఞానేశ్వర్​, సీఎంహెచ్​వో, జీడబ్ల్యూఎంసీ