13 వేల ఇటుక ఆర్డర్ చేస్తే.. సగం రాలే

13 వేల ఇటుక ఆర్డర్ చేస్తే.. సగం రాలే
  • లారీ కింద రెండు లేయర్లు మట్టితో కప్పి చీటింగ్​
  • శంషాబాద్ లో బయటపడ్డ మోసం

శంషాబాద్, వెలుగు: ఇటుక వ్యాపారులు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్డర్​ చేసిన లోడు  కంటే తక్కువగా పంపించి చీటింగ్​ చేస్తున్నారు. లారీల్లో రెండు లేయర్ల లోడును మట్టితో కప్పేసి కస్టమర్లను నిండా ముంచుతున్నారు. ఎలాగూ ఇటుకలు లెక్కించరనే నమ్మకంతో తమకు ఇష్టమున్నట్లుగా సరుకు పంపి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసం శంషాబాద్​లో బయటపడింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఆర్డర్​ కంటే సగం కూడా ఇటుకలు కనిపించకపోవడంతో ఖంగుతిన్నాడు. ఆరా తీస్తే వ్యాపారులు ఉద్దేశ్యపూర్వకంగా మోసం చేస్తున్నట్లు తెలిసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధుర కాలనీలో ఆర్మీ రిటైర్డ్ అధికారి ఇల్లు నిర్మిస్తున్నాడు. మెహిదీపట్నం వద్ద ఇటుక బుక్​ చేసుకున్నాడు. లారీలో 13 వేల ఇటుకలు పంపిస్తామని వ్యాపారులు చెప్పారు. ఇందుకోసం ఒక్కో ఇటుకకు రూ.9.50 పైసల చొప్పున చెల్లించాడు. ఇంటికి లారీలో ఇటుక లోడ్​ వచ్చింది. అన్​లోడ్​ చేస్తున్న కూలీలకు ఇటుక తక్కువ ఉన్నట్లు అనుమానం వచ్చింది. లారీలో సగం లోడు దించాక అడుగు భాగాన్ని పరిశీలించారు. లారీ బాడీ లెవెల్ లో రెండు లేయర్లుగా ఇటుక పేర్చి, అవి బయటికి కనిపించకుండా మట్టితో కప్పారు. ఇలా లోడు ఎత్తుకు కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఆర్డర్​ ఇచ్చిన ఇటుకల్లో సగం కూడా పంపలేదని కూలీలు, యజమాని గ్రహించారు.